సూర్యాపేట, సెప్టెంబర్ 13(నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్‌రెడ్డి ప్రమేయంతోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై దాడి జరిగిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. దీనికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కౌశిక్‌రెడ్డిపై జరిగిన దాడిపై శుక్రవారం ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ‘ఇది కచ్చితంగా రేవంత్‌రెడ్డి చేయించిన దాడే. దీనికి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలి. ఇదేం ప్రజాపాలన ఇదేం ఇందిరమ్మ రాజ్యం? పట్టపగలు హైదరాబాద్ నడిబొడ్డున ఒక ఎమ్మెల్యేపై జరిగిన దాడికి ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ బాధ్యత వహించాలి. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డికి పూర్తి భద్రత కల్పించాలని డీజీపీని డిమాండ్ చేస్తు న్నాం. దాడి చేసిన వారిని అరెస్టు చేయాల్సింది పోయి.. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేయడం ఎంతవరకు న్యాయం. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఆడుతున్న వికృత రాజకీయ క్రీడలో తెలంగాణ పోలీసులు కూడా భాగం కావడం దారుణం’ అని అన్నారు. గురువారం హైదరాబాద్‌లో ఒక ప్రజా ప్రతినిధి ఇంటి మీద పోలీసుల సమక్షంలో దాడి జరుగుతుంటే నియంత్రించకుండా.. రాత్రి నుంచి గ్రామాల్లో ఉన్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేయడం సరికాదని అన్నారు.