హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రియల్ ఎస్టేట్‌రంగం అస్తవ్యస్థం కావడానికి రేవంత్‌రెడ్డి అసమర్థపాలననే కారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కే తారకరామారావు మండిపడ్డారు. మంగళవారం హైదరాబాద్ నగరంలో తెలంగాణ రియల్టర్స్ ఫోరం నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. దున్నేవాడిదే భూమి అన్న నినాదంతో పాటు ఎన్నో ఎన్నో భూ ఉద్యమాలకు తెలంగాణ కేంద్రంగా ఉందని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీకి రంగారెడ్డి జిల్లా, మహబూబ్‌నగర్‌లో చాలాకాలం పట్టుదొరికేది కాదని.. ఇందుకు తెలంగాణ వస్తే భూముల ధరలు తగ్గుతాయని చేసిన ప్రచారమే కారణమని అన్నారు.
తెలంగాణ ఏర్పడితే భూముల విలువ పెరుగుతుందని చెప్పడానికి తమకు చాలా సమయం పట్టిందని గుర్తు చేశారు. ఎన్నో వాదనలు.. మరెన్నో అనుమానాల మధ్యన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని, ఆ రోజే కేసీఆర్ పొట్ట కూటి కోసం వచ్చిన వాళ్లతో మాకు పంచాయితీలేదని, మా పొట్ట కొట్టే వాళ్లతోనే మా పంచాయితీ అని స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు. మాది స్టేట్ ఫైటే… స్ట్రీట్ ఫైట్ కాదని తెలిపారు. అభివృద్ధే మా కులం, సంక్షేమమే మా మతం, తెలంగాణే మా ప్రధాన ఎజెండాగా పెట్టుకొని ఎన్నికలకు పోయామని.. ప్రజల ఆశీర్వాదంతో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని తెలిపారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాకే మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వాళ్లు భూమి మీద పెట్టుబడి పెట్టారని చెప్పారు. తెలంగాణలో ఎంతమంది భూస్వాములు ఉన్నా సాగునీళ్లు లేక ఆ భూములకు విలువరాలేదని చెప్పారు. నాటి పాలకులు ఇక్కడి చెరువులను, చిన్న నీటి వనరులను కాపాడాలనే ఆలోచన చేయలేదని విమర్శించారు.
కాంగ్రెస్ మార్పు మంచిగున్నదా ?
మార్పు కోసం.. అని ఎన్నికల ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ 11నెలల పాలనలో మార్పు మంచిగున్నదా ? అని కేటీఆర్ ప్రశ్నించారు. అమ్మ విలువ, అన్నం విలువ లేనప్పుడే తెలుస్తాయన్నట్టు.. కేసీఆర్ ప్రభుత్వం విలువ కూడా ఇప్పుటికే తెలుస్తున్నదని చెప్పారు. తెలంగాణ వచ్చిన రోజు కరెంటు కోతలు, పరిశ్రమలకు పవర్ హాలీడేలు, రైతులకు అర్ధరాత్రి కరెంటులు ఉండేవని.. ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రారంభమైన కేసీఆర్ ప్రయాణం ఒక్కొక్కటీ బాగు చేసి రాష్ర్టాన్ని పటిష్టంగా, పెట్టుబడులకు బ్రహ్మాండంగా తీర్చిదిద్దారని చెప్పారు. రియల్ ఎస్టేట్‌లో భూముల ధరలు ఛూమంతర్ అనగానే పెరగలేదని.. రాష్ట్రంలో సమగ్ర, సమీకృత, సమ్మిళిత అభివృద్ధిని కేసీఆర్ చేసి చూపించడం వల్లే సాధ్యమైందని తెలిపారు. నేడు ఏ రైతును కదిలించినా బాధపడుతున్నారని.. కాంగ్రెస్‌ను నమ్మి మోసపోయామని చెబుతున్నారని పేర్కొన్నారు. నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులే కాంగ్రెస్ చేసిన మోసాలను చెబుతున్నారని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పాలన ఇలాగే కొనసాగితే సంక్షోభం తప్పదని, ప్రజల చేతుల్లో డబ్బులు లేకుండా ప్రభుత్వం చేస్తుండడమే ఈ పరిస్థితికి కారణమని చెప్పారు. ఆలోచన లేకుండానే హైడ్రాను ఏర్పాటు చేసి బ్లాక్ మెయిల్ దందా చేస్తున్నారని విమర్శించారు. రియల్ ఎస్టేట్ సంస్థలు నిర్మించే ప్రాజెక్టులకు లేక్ వ్యూ అని పేరు పెట్టాలంటే భయపడేపరిస్థితులు ఉన్నాయని చెప్పారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో నో ఎల్ఆర్ఎస్, నో బీఆర్ఎస్ అని చెప్పి.. ఇప్పుడు ముక్కుపిండి మరీ ఎల్ఆర్ఎస్ వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కేటీఆర్ సూచించారు. లక్షలాది మంది రియల్ ఎస్టేట్ ఏజెంట్ల కోసం అసెంబ్లీలో ప్రభుత్వంపై పోరాటం చేస్తామని చెప్పారు. తెలంగాణ రియల్టర్స్ ఫోరం మరింత బలపడాలని కేటీఆర్ సూచించారు. టీఆర్ఎఫ్ డిమాండు చేస్తున్న 5 పాయింట్ల ఎజెండా చాలా సముచితమైందని కేటీఆర్ పేర్కొన్నారు. సమావేశంలో తెలంగాణ రియల్టర్స్ ఫోరం అధ్యక్షులు శ్రీనివాస్‌రెడ్డితో పాటు వందలాది మంది రియల్ ఎస్టేట్ ఏజెంట్లు పాల్గొన్నారు.
కేసీఆర్ పాలనలో సాగునీళ్లు వచ్చాక రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లినా ఎకరానికి రూ.15 లక్షల నుంచి 20 లక్షల వరకు ధర పలుకుతున్నది. భూమి విలువ పెరిగితే భూయజమానికి భరోసా ఉంటుంది. అందుకు కారణం ముమ్మాటికీ కేసీఆరే.
– కేటీఆర్
హైడ్రా పేరుతో అనాలోచితంగా ఇండ్లను కూల్చివేయడంతో ఓ మహిళ 20 ఏండ్ల పాటు ఈఎంఐ ఎలా కట్టాలని ప్రశ్నించింది. మరి దానికి హైడ్రానా? మున్సిపల్ శాఖనా? ముఖ్యమంత్రా? ఎవరు సమాధానం చెబుతారు.
– కేటీఆర్
రియల్ ఎస్టేట్ గురించి తన కన్నా ఎక్కువ ఎవరికీ తెలుసు అని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలనలో రాష్ట్రంలో రియల్ రంగం అగమ్యగోచరంగా తయారైంది. గుంపు మేస్త్రీ మాదిరిగా పనిచేస్తానన్న రేవంత్‌రెడ్డి 11 నెలల్లో రియల్‌రంగానికి ఒక్క మంచి నిర్ణయం తీసుకోలేదు.
-కేటీఆర్