BRS Party | భారత రాష్ట్ర సమితి పార్టీకి మహారాష్ట్ర వ్యాప్తంగా అపూర్వ ఆదరణ లభిస్తోంది. ఇప్పటికే నాందేడ్, కంధార్ లోహాలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలు విజయవంతమయ్యాయి. మరో రెండు రోజుల్లో ఔరంగాబాద్ వేదికగా బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో ఔరంగబాద్‌కు చెందిన కీలక నేతలు గులాబీ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారు.
తాజాగా సర్దార్ వల్లభాయ్ పటేల్ రాష్ట్రీయ పార్టీని బీఆర్ఎస్లో విలీనం చేస్తున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. సర్దార్ వల్లభాయ్ పార్టీకి చెందిన నేతలు బాబా సాహెబ్ షెల్కే, బాల్ భీమ్ రావు చవాన్, సుభాష్ బోరికర్.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో శనివారం ఉదయం ఔరంగాబాద్‌లో సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్ పార్టీని బీఆర్ఎస్లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు.
బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులమయ్యామని ఆ పార్టీ ప్రతినిధులు తెలిపారు. తెలంగాణ మోడల్‌ను మహారాష్ట్రలో కూడా అమలు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయితే తెలంగాణ మోడల్ మహారాష్ట్రలో అమలు కావాలంటే అది కేసీఆర్ వల్లే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.