సైదాపూర్: సామాన్య కుటుంబంలో పుట్టినా.. మొఘల్ చక్రవర్తులను ఓడించి గోల్కొండ కోటపై విజయ పతాకం ఎగరేసిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న (Sarvai Pappanna). 300 ఏండ్ల క్రీతం నాటి సుబేదార్లు, జాగీర్దార్ల నియంత పాలన, వారి అరాచకాలను ఎదురించి తెలంగాణ పౌరుషాన్ని చాటిన యోధుడు తొలి తెలంగాణ బహుజన రాజు సర్దార్ సర్వాయి పాపన్న. అన్ని వర్గాలకు చెందిన వారిని సైన్యంలో చేర్చుకొని అలుపెరుగని పోరాటంతో తన లక్ష్యాన్ని సాధించుకొని చరిత్రలో తొలి తెలంగాణ బహుజన రాజుగా నిలిచిన ఆయన జయంతి నేడు. ఈ సందర్భంగా పాపన్న జీవిత విశేషాలు.
వరంగల్ జిల్లాలోని జనగాం మండలం ఖిలా షాపూర్ సర్వాయి పాపన్న 1850 ఆగస్టు 18న గీత కార్మిక కుటుంబంలో జన్మించారు. తల్లి పేరు సర్వమ్మ. చిన్నప్పటి నుంచే నాయకత్వ లక్షణాలున్న పాపన్నకు స్నేహితులు ఎక్కువే. యుక్త వయస్సుకు రాగానే తన చుట్టూ పరిస్థితులను గమనించారు. ప్రజలపై మొఘల్ చక్రవర్తులు, వారి సామంతులైన సుబేదార్లు ఇష్టారీతిగా పన్నులు వేసేవారు. చెల్లించలేని వారిని నిర్ధాక్షిణ్యంగా చంపేసేవారు. ఎవరైనా ప్రశ్నిస్తే వారిని బంధించేవారు. ఇవన్నీ గమనించిన పాపన్న వారిపై తిరుగుబాటు చేయాలని అనుకున్నారు. ఓ రోజు తాళ్లెక్కమని తల్లి అడిగితే.. ‘కొడితే గోల్కొండ కోటను కొట్టాలి.. తాళ్లు ఎక్కితే ఏమస్తది’ అని యాదృచ్చికంగా అన్న మాటలే ఆయన జీవన గమనాన్ని మార్చివేశాయి.
మిత్రులను సమీకరించుకున్న పాపన్న.. యుద్ధవిద్యల్లో వారికి రహస్యంగా శిక్షణ ఇచ్చేవారు. తల్లి తన కోసం దాచిన ధనాన్ని తీసుకొని ఆయుధాలు సమకూర్చుకున్నారు. నాటి పాలకులు ప్రజల నుంచి బలవంతంగా వసూలు చేసిన సొమ్మును గడీలు, దేవిడీలు, కోటల నుంచి స్వాధీనపరుచుకొని అక్కడ బందీలుగా ఉన్న వేలాది మంది యువకులను విడిపించారు. వరంగల్ ప్రాంత జమీందారులు ఏకమై అతడిని అంతంచేయాలని నిర్ణయించుకోగా, విషయం తెలుసుకున్న పాపన్న కరీంనగర్ జిల్లాలోని జగిత్యాలలో మారువేషంలో రహస్య జీవితం గడిపారు. అక్కడ కూడా జమీందారు గడీల సొమ్మును రాత్రిపూట కొల్లగొట్టి పేదలకు పంచారు. ఈ విషయం తెలుసుకున్న వరంగల్ జమీందారులు జగిత్యాల దొరకు సమాచారం అందించడంతో పాపన్నను కారాగారంలో వేశారు. అక్కడ ఉన్న యువకులను ఒక్కటి చేసి వారికి యుద్ధవిద్యలు నేర్పించారు. కొంతకాలం తర్వాత.. ఒకనాటి రాత్రి జైలుగోడలను బద్దలుకొట్టిన పాపన్న, తనతోపాటు వేల మందికి జైలు జీవితం నుంచి విముక్తి కల్పించారు.
తనతో వచ్చిన 200 మందితో సైదాపూర్ మండలంలోని సర్వాయిపేటకు మకామ్ మార్చారు. సర్వాయిపేటలోని కోట దట్టమైన అటవీప్రాంతం కావడంతో రహస్య జీవితం గడిపేందుకు పాపన్న దానిని ఎంచు కున్నారు. సర్వాయిపేటకు ఆనుకొని ఉన్న కోట (నేటి పాపన్నగుట్ట) వద్ద తన సైనికులకు శిక్షణ ఇచ్చాడు. అలా సమీప గ్రామాల ప్రజలు రెండు వేల మంది సైన్యంలో చేరారు. చుట్టు పక్కల ఉన్న ప్రాంతాల్లోని ధనికుల నుంచి డ బ్బును సేకరించేవారు. అలా వచ్చిన సొమ్ముతో 1675లో సర్వాయిపేటలో తన తల్లి సర్వమ్మ పేరుతో మొట్టమొదటి కోట కట్టారు. తర్వాత కోటగిరి గుట్టల్లో మరో కోట, కోనేరును నిర్మించాడు. సర్వాయిపేట కోట నుంచి కోటగిరి గుట్టల్లోని కోట వరకు రహస్య మార్గాన్ని తవ్వించారు. గుట్ట చుట్టూ నీళ్లు నింపి వాటిలో నుంచి శత్రువులు రాకుండా మొసళ్లను పెంచేవారు. అలా కొన్నా ళ్లకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారితో ఆయన సైన్యం రెండు వేలదాకా చేసింది. తర్వాత 1698లో తాటికొండ కోట, 1785లో ఖిలాషాపురంలో కోట, ఇలా తెలంగాణలో సుమారు 21 కోటలను కట్టించాడు. సర్వాయిపేటలోని పాపన్న కోట నుంచి తన సైన్యంతో బయలుదేరి 1798లో గోల్కొండ కోటను జయించి తొలి తెలంగాణ బహుజన రాజు అయ్యాడు.
సామాన్య కుటుంబంలో జన్మించిన సర్వాయి పాపన్న మొదటి నుంచి తాము సేకరించిన ధనాన్ని.. పేదలకు పంచేవారు. సర్వాయిపేట గ్రామంలో ప్రజల కోసం తన మిత్రుడి పేరుతో సర్వన్న చెరువును తవ్వించారు. హుస్నాబాద్ ఎల్లమ్మ ఆలయం, పాపన్నగుట్టల్లో బయన్న ఆలయం, సర్వాయిపేటలో శివాలయం, పలు గ్రామాల్లో హనుమాన్ ఆలయాలను నిర్మించారు. తన రాజ్యంలో ఎవరి పనులు వారు స్వేచ్ఛగా చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ప్రజలపై ఎలాంటి పన్నులు వేయలేదు. అందుకే నాడు ప్రజలు పాపన్న వెంట నడిచారు. పరిపాలనా వ్యవహారాల్లో నిమగ్నమై ఉన్న సందర్భంలో మొఘలులు కొందరు స్థానికుల సహాయంతో జరిపిన యుద్ధంలో వీరోచితంగా పోరాడిన పాపన్న.. గోల్కొండ కోటలో అత్మార్పణ చేసుకున్నారు. తెలంగాణ బిడ్డల పౌరుషాన్ని ప్రపంచానికి చాటిన పాపన్న విగ్రహాన్ని లండన్లోని ఆల్బర్ట్ మ్యూజియంలో నాటి ప్రముఖ విప్లవయోధుల సరసన పెట్టడం ఆయన గొప్పతనానికి నిదర్శనం. భారత దేశ మరో శివాజీ పాపన్న.