హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులపై కృషి చేస్తున్న గ్రీన్ ఇండియా చాలెంజ్ (జీఐసీ) వ్యవస్థాపకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్‌కుమార్ మరో ప్రతిష్టాత్మక వేదికపై ప్రసంగించనున్నారు. ఈ నెల 28, 29 తేదీల్లో బెంగళూరులోని ప్రఖ్యాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) క్యాంపస్‌లో నిర్వహించనున్న ‘క్లైమేట్ ఇన్నోవేషన్ సమ్మిట్-2026’లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, కీలక ప్రసంగం చేయనున్నారు. ‘సైప్లె చైన్ మేనేజ్మెంట్ సెంటర్ (ఐఐఎం బెంగళూరు)’, ‘నెట్‌జీరో థింక్’ సంస్థలు సంయుక్తంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నాయి. ‘వికసిత్ భారత్ 2047 కోసం భారతదేశ నెట్‌జీరో మార్గాలను వేగవంతం చేయడం’ అనే ప్రధాన ఇతివృత్తంతో ఈ సమ్మిట్ నిర్వహిస్తున్నారు.
‘రీథింకింగ్ క్లైమేట్ ఫెడరలిజం: స్థానిక చర్యల కోసం విధానాలు, ఆచరణ, ఆవిషరణలను పునర్నిర్మించడం’అంశంపై సంతోష్‌కుమార్ ప్రసంగిస్తారు. పర్యావరణ నిర్వహణలో స్థానిక కమ్యూనిటీలను ఏ విధంగా భాగస్వాములను చేయాలి? గ్లోబల్ సౌత్ దేశాలకు ఉపయోగపడే పర్యావరణ పునరుద్ధరణ నమూనాలు ఏమిటి? కేవలం చట్టాల ద్వారా కాకుండా, ప్రజల భాగస్వామ్యంతో క్షేత్రస్థాయిలో చేపట్టే పచ్చదనం ఉద్యమాలు, ప్రకృతి ఆధారిత క్లైమేట్ రెసిలియెన్స్ వ్యూహాల ఆవశ్యకత, జాతీయ పర్యావరణ లక్ష్యాలను సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక ప్రజల క్రియాశీలక పాత్ర.. వంటి అంశాలపై తన ఆలోచనలను పంచుకోనున్నారు.
సంతోష్‌కుమార్ ఇటీవల లండన్‌లోని బ్రిటిష్ పార్లమెంట్లో జరిగిన వరల్డ్ క్లైమేట్ లీడర్స్ కాంక్లేవ్‌లో ‘గ్లోబల్ గ్రీన్ ఐకాన్’ అవార్డును అందుకున్న విషయం తెలిసిందే. ఈ క్లైమేట్ సమ్మిట్‌లో సంతోష్‌కుమార్‌తోపాటు వివిధ రంగాల ప్రముఖులు పాల్గొంటున్నారు. డీఆర్డీవో మాజీ చైర్మన్ డాక్టర్ జీ సతీశ్‌రెడ్డి, ఇస్రో గగన్ యాత్రి, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా, ప్రముఖ పర్యావరణవేత్త ఎరిక్ సోల్హీమ్, రాజీవ్త్రిపాఠి, మనోజ్‌కుమార్‌సింగ్, విభాధావన్ తదితరులు పాల్గొంటారు.