హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ) : సన్నబియ్యం పంపిణీలో అవకతవకలు జరగకుండా చూడాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో మంత్రులు, సీఎస్‌తో కలిసి కలెక్టర్లు, ప్రజాప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న నిరుపేదలందరికీ పూర్తి స్థాయిలో ఆహార భద్రత కల్పించేందుకే సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. సన్నబియ్యం పంపిణీని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ప్రజాప్రతినిధులంతా చౌకధరల దుకాణాలను సందర్శించాలని కోరారు. సన్నబియ్యం సరఫరాకు సరిపడా రవాణా వసతి కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు.