ఆదివారం 17 జనవరి 2021
Telangana - Jan 14, 2021 , 20:14:16

క‌డ్తాల్‌లో వైభవంగా సంక్రాంతి వేడుకలు

క‌డ్తాల్‌లో వైభవంగా సంక్రాంతి వేడుకలు

నిర్మల్ : సోన్ మండలంలోని కడ్తాల్ గ్రామ శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప ఆలయం అయ్యప్ప నామస్మరణ, సంకీర్తనలు, శరణుఘోషతో పులకరించింది. ఆలయంలో సంక్రాంతి వేడుకలను గురువారం వైభవంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవ అనంతరం అలంకార ప్రియుడైన స్వామికి విశేష పూజలు చేశారు. రంగురంగులపూలతో అలంకరించారు. స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో ఆభరణాలను గ్రామ పురవీధులగుండా భాజాభజంత్రీల నడుమ ఊరేగించారు. అనంతరం ఆభరణాలను స్వామివారికి అలంకరించారు. 

ఉమ్మడి జిల్లాలోనే మొదటి అయ్యప్ప ఆలయం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై మణికంఠున్ని దర్శించుకున్నారు. తదనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. సాయంత్రం మెట్ల పూజ నిర్వహించి కర్పూర మకరజ్యోతి వెలిగించారు. వేడుకల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ గురుస్వామి నర్సారెడ్డి ఆధ్వర్యంలో శ్రీ ధర్మశాస్త్ర ట్రస్టు సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు.