హనుమకొండ చౌరస్తా, జనవరి 12: వరంగల్ నిట్(NIT) క్యాంపస్‌లో సంక్రాంతి(Sankranthi )సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఒకే వేదికపై భారతదేశంలోని వివిధ రాష్ట్రాల సాంస్కృతిక సంప్రదాయాలను కలిపి సంక్రాంతి, పొంగల్, బిహు, లాహిరి ఉత్సవాలను కన్నుల పండువగా నిర్వహించారు. ఈ కార్యక్రమం భిన్నత్వంలో ఏకత్వం స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది, విద్యార్థుల నుంచి ఉత్సాహభరితమైన భాగస్వామ్యాన్ని చూసిందపి డీన్ ప్రొఫెసర్ కిరణ్ కుమార్, ప్రొఫెసర్ పెరుగు శ్యామ్‌తో అన్నారు.
వేడుకల్లో భాగంగా విద్యార్థులకు రంగోలి తయారీ, గాలిపటాల తయారీ, ఎగరడం, టగ్-ఆఫ్-వార్, పరుగు పందాలు, సాంప్రదాయ దుస్తుల పోటీలు, పొంగల్ తయారీ వంటి వివిధ రకాల పోటీలను నిర్వహించారు. విజేతలకు వారి పనితీరు, సృజనాత్మకతకు గుర్తింపుగా బహుమతులు ప్రదానం చేశారు. ఉత్సాహభరితమైన వాతావరణాన్ని పెంచుతూ లాంతరు పోటీలతో సాయంత్రం వరకు ఉత్సవాలు కొనసాగాయి. సాంప్రదాయ సంక్రాంతి వంటకాలు కూడా విద్యార్థులకు పంపిణీ చేశారు. అనేక స్టాళ్లు, సెల్ఫీ పాయింట్లు ఆకర్షణీయంగా నిలిచాయి.