హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): గ్రామాల్లో పారిశుద్ధ్యం పడకేసింది.. దోమలు ముసురుతున్నాయి.. సీజనల్ రోగాలతో ప్రజలు అల్లాడుతున్నారు.. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంచాయతీల్లో పాలనే పడకేసింది. బీఆర్ఎస్ పాలనలో ప్రగతిపథంలో ఉన్న పల్లెలు నేడు నిధుల్లేక దీనావస్థలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ దశలో ప్రభుత్వం సోమవారం నుంచి ఇదే నెల 9 వరకు ‘స్వచ్ఛదనం- పచ్చదనం’ కార్యక్రమం చేపట్టేందుకు ముందుకొచ్చింది. కానీ నిధులు కేటాయించకుండా ప్రత్యేక కార్యక్రమంలో పనులెలా చేయాలంటూ పంచాయతీల కార్యదర్శులు గగ్గోలు పెడుతున్నారు. పల్లెల దుస్థితిపై బీఆర్ఎస్ నిలదీయడంతోనే సర్కారులో కదలిక వచ్చి ఈ కార్యక్రమం చేపట్టేందుకు చొరవ చూపింది. గ్రామ పంచాయతీలకు గత కొన్ని నెలలుగా ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ట్రాక్టర్ల డిజిల్ డబ్బుల్లేక, నిర్వహణ వ్యయం భారమై ఎక్కడివి అక్కడే మూలకు పడ్డాయి.
వేతనాలు ఇవ్వకపోవడంతో పారిశుద్ధ్య కార్మికులు పనులు బంద్ చేయడంతో ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి ఈ వేతనాలు మినహా పంచాయతీలకు మరే నిధులను ఇవ్వలేదు. ఇంతలోనే చేపట్టనున్న స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమానికి నిధులు విడుదల చేయకుండా పనులెలా సాధ్యమని పంచాయతీల కార్యదర్శులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే చేసిన పనులకు అప్పులపాలై ఉన్నామని, కొత్తగా డబ్బులు ఎక్కడి నుంచి తేవాలంటూ కార్యదర్శులు లబోదిబోమంటున్నారు. స్వచ్ఛదనం -పచ్చదనం కార్యక్రమ పర్యవేక్షణకు రెండు జిల్లాలకు ఒకరి చొప్పున ప్రత్యేకంగా 16 మంది ఐఏఎస్ అధికారులను పర్యవేక్షకులుగా ప్రభుత్వం నియమించింది. గ్రామస్థాయిలో పంచాయతీ ప్రత్యేక అధికారి, పంచాయతీ కార్యదర్శి, ఆశ వరర్, స్థానిక ప్రజలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఆ శాఖ ఏర్పాట్లు చేసింది.
అబ్బాపురంలో ప్రారంభించనున్న మంత్రి సీతక్క
ములుగు మండలం అబ్బాపురం గ్రామంలో స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమాన్ని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక ప్రారంభించనున్నారు. అనంతరం మంగపేట మండల కేంద్రంలో జరిగే అవగాహన సదస్సులో మంత్రి పాల్గొంటారు. పల్లెల రూపురేఖలు మార్చేలా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు. ‘నా గ్రామం నా గౌరవం’ నినాదంతో గ్రామస్థులంతా పారిశుద్ధ్యం, అభివృద్ధి కార్యక్రమాలలో పాలుపంచుకోవాలని కోరారు.