మధిర(చింతకాని), జనవరి 9 : గతంలో తనకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి బిల్లు మింగిన వారిపై చర్య తీసుకోవడంతోపాటు తనకు ఇల్లు మంజూరు చేయాలని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కిన ఘటన ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగిలిగొండలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పంచాయతీ పారిశుధ్య కార్మికుడు పామర్తి శ్రీను భార్య లక్ష్మీతిరుపతమ్మ పేరుపై 2012లో ఇందిరమ్మ ఇల్లు మంజూరుకాగా దీనికి సంబంధించిన బిల్లును మరొకరు కాజేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామన్న క్రమంలో పామర్తి శ్రీను, అతడి భార్య ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారు.
దరఖాస్తుదారులను యాప్ ద్వారా ఫొటో తీసి సర్వే చేయగా లక్ష్మీతిరుపతమ్మ పేరుపై ఉమ్మడి రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని, బిల్లుకూడా చెల్లించినట్టు తేలింది. దీంతో శ్రీను.. ఎంపీడీవో, తహసీల్దార్, ఎస్సైని ఆశ్రయించగా స్పందించకపోవడంతో సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఎస్సై నాగుల్ మీరా సిబ్బందితో చేరుకుని శ్రీనును టవర్ దిగి కిందకు రావాలని కోరారు. ఫోన్ ద్వారా సంప్రదింపులు జరుపుతున్నప్పటికీ దిగొచ్చే పరిస్థితి లేకపోవడంతో అధికారులు, ప్రజల్లో ఆందోళన నెలకొంది.