హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో గ్రామాల్లో శానిటేషన్ సమస్య తలెత్తకుండా శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని పంచాయతీరాజ్ శాఖ నిర్ణయించింది. వరదలు, వర్షాలపై శనివారం సీఎం కేసీఆర్ నిర్వహించిన సమీక్షలో పంచాయతీరాజ్ అధికారులకు ఇచ్చిన ఆదేశాలతో ఆగస్టు రెండోతేదీ వరకు శానిటేషన్ డ్రైవ్ నిర్వహించనున్నారు. ఈ డ్రైవ్‌పై ఆ శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా టెలికాన్ఫరెన్స్ నిర్వహించగా.. ఆ శాఖ డైరెక్టర్ హనుమంతరావు ఆదేశాలు జారీ చేశారు. శానిటేషన్ డ్రైవ్ నేపథ్యంలో పంచాయతీరాజ్ అధికారులు ఎవ్వరు కూడా పనిచేసే ప్రాంతాన్ని విడిచి వెళ్లవద్దని, అత్యవసరమైతే కలెక్టర్ అనుమతి తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.
డీపీవో, డీఎల్పీవో, ఎంపీడీవో, ఎంపీవోలు గ్రామ పంచాయతీలను ప్రతి రోజు తనిఖీ చేయాలని ఆదేశించారు. తనిఖీల సమయంలో గ్రామంలోని లోతట్టు ప్రాంతాలను, బలహీనవర్గాల కాలనీలను సందర్శించాలని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రతి గ్రామ పంచాయతీ బ్లీచింగ్ పౌడర్, లైం, బైటెక్స్, ఆయిల్ బాల్స్ ఇతర శానిటేషన్ మెటీరియల్‌ను అవసరమైనంత అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ప్రతి గ్రామంలో స్ప్రేయర్స్, ఫాగింగ్ మిషన్లు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఒక వేళ ఫాగింగ్ మిషన్లు లేకుంటే గ్రామ పంచాయతీ నిధులతో కొనాలని, లేకుంటే సీఎస్ఆర్ ఫండ్స్, దాతల సాయంతో సమీకరించుకోవాలని సూచించారు. శానిటేషన్ సిబ్బంది అదనంగా అవసరమైతే కలెక్టర్ అనుమతి తీసుకోవాలని సూచించారు. గ్రామంలోని లోతట్టు ప్రాంతాలను, నీరు నిల్వ ఉండే ప్రదేశాలను ప్రతి రోజు సర్పంచ్, గ్రామ కార్యదర్శి సందర్శించి నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ మురుగు నీరు సులువుగా వెళ్లే విధంగా చూడాలని సూచించారు. బ్లీచింగ్ పౌడర్‌ను గ్రామ మొత్తం చల్లాలని ఆదేశించారు. దోమ తెరల వినియోగంపై ప్రజల్లో చైతన్యం తీసుకోవాలని పేర్కొన్నారు. తాగునీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని, మిషన్ భగీరథ అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.