SERT | హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ సంస్థ(ఎస్ఈఆర్టీ) అధికారుల తీరుపై ప్రభుత్వ వర్గాలు, ఉపాధ్యాయుల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల వింత సర్క్యులర్లే ఇందుకు కారణమని చెప్తున్నారు. వివరాల్లోకి వెళ్తే తాజాగా ఎస్ఈఆర్టీ ఇచ్చిన సర్క్యులర్‌లో సంగారెడ్డి జిల్లాలోని ఓ స్కూల్ అడ్రస్, అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయుడి వివరాలను పేర్కొని, ఆ స్కూల్ వరంగల్‌లో ఉన్నట్టు తెలిపింది. మెదక్ జిల్లాలోని టీచర్ వివరాలను సంగారెడ్డి జిల్లా జాబితాలో చేర్చారు. నిజామాబాద్ జిల్లాలోని స్కూల్, ఉపాధ్యాయుడి వివరాలన్నీ రాసి, ఆ స్కూల్ ఖమ్మం జిల్లాలో ఉన్నట్టు చూపించారు. పెద్దపల్లి ఉపాధ్యాయుడి వివరాలు పేర్కొని, ఆ స్కూల్ హైదరాబాద్‌లో ఉన్నట్టు ఉత్తర్వులు ఇచ్చారు. ఇలా జాబితా అంతా గందరగోళంగానే ఉన్నదని ఉపాధ్యాయులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఉన్నతాధికారులు సంతకాలు పెట్టే ప్రాథమిక వివరాలు కూడా చూసుకోరా అని ప్రశ్నిస్తున్నారు.
ఉపాధ్యాయుల్లో మెలకువల పెంపు శిక్షణ ఇచ్చేందుకు రిసోర్స్‌పర్సన్స్ కోసం ఎస్ఈఆర్టీ 393 మంది టీచర్లకు ఇంటర్వ్యూ నిర్వహించి, 152 మందిని రిసోర్స్పర్సన్లుగా ఎంపిక చేసింది. ఈ మేరకు సర్క్యులర్లు ఇచ్చింది. ఈ సర్క్యూలర్‌ను చూసిన డీఈవోలు, ఉపాధ్యాయులు కంగుతిన్నారు. సుమారు 30 మంది వివరాల్లో తప్పులున్నాయని తెలిపారు.
ఇంతకుముందు మార్చి 8న ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులకు ప్రభుత్వం స్పెషల్ సీఎల్ ఇచ్చింది. కానీ ఆ రోజు అందరూ ఆఫీస్‌లకు రావాలని, ‘శ్రమదానం’ చేయాలని అధికారులు ఓ సర్క్యూలర్ ఇచ్చారు. ఉద్యోగులు ప్రశ్నించడంతో సర్క్యూలర్‌ను వెనక్కి తీసుకున్నారు.