హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): పుష్ప-2 సినిమా ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొకిసలాటలో ఓ మహిళ మృతిచెందిన ఘటనపై చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని ఆ థియేటర్ యాజమాన్యం, భాగస్వాములు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ బెనిఫిట్ షోను తాము ఏర్పాటు చేయలేదని, ప్రభుత్వం నుంచి అనుమతి పొంది మైత్రీ డిస్ట్రిబ్యూటర్ ఏర్పాటు చేసిందని, బుకింగ్ ఒప్పందంలో భాగంగా 4,5 తేదీల్లో బెనిఫిట్ షోల కోసం డిస్ట్రిబ్యూటర్ నియంత్రణలోనే థియేటర్ ఉన్నదని పేర్కొన్నారు. బెనిఫిట్ షోల సందర్భంగా థియేటర్ వద్ద రద్దీ ఉంటుందని ముందే ఊహించి చికడపల్లి ఎస్హెచ్వోతోపాటు ట్రాఫిక్ పోలీసులకు సమాచారం ఇచ్చామని, అయినా తగినంత మంది సిబ్బంది లేకపోవడంతో ఈ ఘటన జరిగిందని వివరిస్తూ.. పోలీసులు నమోదు చేసిన అభియోగాలు తమకు వర్తించబోవని పేరొన్నారు. ఈ నేపథ్యంలో ఈ వ్యాజ్యంపై విచారణ పూర్తయ్యే వరకు పోలీసులు తమను అరెస్టు చేయకుండా మధ్యంత ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.