హైదరాబాద్, జనవరి 13(నమస్తే తెలంగాణ): ట్రాఫిక్ చలాన్ల విషయంలో సీఎం రేవంత్రెడ్డి రెండు నాల్కల ధోరణి అవలంబిస్తున్నారని ఇసుక లారీల యజమానుల సంఘం ఆరోపించింది. ఎన్నికలకు ముందు పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై 50 శాతం రాయితీ ఇస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి, అధికారంలోకి వచ్చాక నేరుగా బ్యాంక్ ఖాతాల నుంచి చలాన్ల డబ్బులు కట్ అయ్యేలా చేస్తాననడం శోచనీయమని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు. కొత్త విధానం వస్తే సామాన్య వాహనదారులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడతారని, ముఖ్యంగా ఇసుక లారీల యజమానులు వ్యాపారాలు మూసుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. ట్రాఫిక్ చలాన్లపై సర్కార్ వైఖరి మార్చుకొని, గతంలో హామీ ఇచ్చినట్టు పెండింగ్ చలాన్లపై 50 శాతం రాయితీ ఇవ్వాలని యాదయ్యగౌడ్ డిమాండ్చేశారు.