నిజామాబాద్, జూలై 29(నమస్తే తెలంగాణ ప్రతినిధి): మంజీర పరీవాహకంలో ఇసుక దోపిడీ అడ్డుఅదుపు లేకుండా సాగుతున్నది. అనుమతుల పేరిట ఇష్టారీతిన దందా నడుస్తున్నది. అధికార యంత్రాంగం చూసీచూడనట్టుగా వ్యవహరిస్తుండటం అనుమానాలకు తావిస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడకముందు మంజీరలో ఇసుక తవ్వకం పారదర్శకంగా జరిగేది. టీజీఎండీసీ ద్వారా అనుమతులిచ్చిన క్వారీల్లోనే ఇసుక తవ్వేవారు. గత ఏడు నెలలుగా అధికార పార్టీ కీలక నేతలు, వారి అనుయాయులు దోపిడీ పర్వానికి తెర లేపి, ఇసుక దందాతో జేబులు నింపుకొంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత గత ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల మేరకు రెండు క్వారీలను టీజీఎండీసీ తెరిచింది. పట్టా భూమిలోనూ మరో క్వారీకి అనుమతులిచ్చింది. ఇక్కడినుంచి అడ్డూ అదుపు లేకుండా ఇసుక దందా చేసినట్టు సమాచారం. వే బిల్లులు లేకుండానే ఇష్టారాజ్యంగా వ్యవహారాలను నడిపించినట్టు తెలుస్తున్నది. ఒకచోట అనుమతి పొంది మరోచోట తవ్వకాలు జరపడంతోపాటు అనుమతికి మించి లారీల్లో ఇసుకను తరలిస్తూ ఒక ట్రిప్పుకు రెండు ట్రిప్పులంతా లాభాలను ఆర్జించారు. మంజీరకు ఇరువైపులా ఇద్దరు కీలక కాంగ్రెస్ నేతల కనుసన్నల్లోనే ఇదంతా జరుగగా ఇసుక పంచాయితీ విషయంలో ఒప్పందాలు చెడి చివరకు ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకునేవరకు వెళ్లిందని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంజీరాలో కొత్తగా క్వారీలకు అనుమతులు మంజూరు చేయలేదు. పాత అనుమతులను పునరుద్ధరించి ఇసుక వ్యాపారాన్ని టీజీఎండీసీ, పట్టాదారుల భూముల్లో కొనసాగించింది. ఇందులో అక్రమాలున్నట్టు ఫిర్యాదులు రావడంతో ఉన్నతస్థాయిలో విచారణ చేపట్టగా, రూ.12 కోట్లు విలువ చేసే ఇసుకను అక్రమంగా తవ్వినట్టు నిర్ధారించారని సమాచారం. టీజీఎండీసీ ఈ నెల 23న విడుదలచేసిన ప్రకటన ప్రకారం.. దాదాపు 60 వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను తోడేందుకు అనుమతులు తీసుకుని అక్రమంగా నాలుగు లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను తవ్వినట్టుగా నిర్ధారించినట్టు సమాచారం. ఈ విషయాన్ని నిర్ధారించేందుకు టీజీఎండీసీ అధికారులు నిరాకరిస్తున్నారు. ఇసుక వ్యాపారంలో ప్రభుత్వ నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని విచారణ బృందం గుర్తించడంతో క్వారీల్లో పనిచేసే పలువురు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై వేటు వేసినట్టు తెలుస్తున్నది. టీజీఎండీసీ, ప్రైవేటు పట్టాలో ఇసుక తవ్వకాలకు క్వారీలను దక్కించుకున్న వ్యాపారులకు అనుమతులు రద్దు చేసినట్టు తెలిసింది. ఇందులో కేఎస్ఆర్ కన్స్రక్షన్స్, ఎంఎస్ఆర్ ప్రాజెక్ట్, సుధాకర ఇన్ఫ్రాటెక్, సాయిడాక్స్ ఇంజినీర్స్ కంపనీలు ఉన్నట్టు తెలుస్తున్నది. ప్రభుత్వ నిబంధనల ఉల్లంఘనల నేపథ్యంలో వీరిపై రికవరీ అస్ర్తాన్ని ప్రభుత్వం ప్రయోగిస్తుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.
ఇసుక దోపిడీలో ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఒక మంత్రి అండదండలతో పలువురు ఇసుక వ్యాపారులు రంగప్రవేశం చేసినట్టు చెప్పుకుంటున్నారు. కామారెడ్డి జిల్లాకు చెందిన ఒక కీలక నేత, కొత్తగా గెలిచిన ఒక ఎమ్మెల్యేకు తోడుగా బాన్సువాడలో ఓడిన మరో మాజీ ఎమ్మెల్యే సైతం అందిన కాడికి దండుకున్నట్టు ఆరోపణలున్నాయి. సొంత నియోజకవర్గాన్ని వదిలి బాన్సువాడలో వాలిన ఒక మాజీ ఎమ్మెల్యే తనదైన శైలిలో ఇసుక వ్యాపారంలో కాలు పెట్టినట్టు సమాచారం. తాజాగా మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో తమ వ్యూహం బెడిసి కొట్టడంతో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నట్టు కాంగ్రెస్ వర్గాలు కోడై కూస్తున్నాయి. కాంగ్రెస్‌లో రాజుకున్న కొత్త పంచాయితీ వల్ల ప్రభుత్వం ఎట్టకేలకు విచారణ చేయించి క్వారీలను మూయించినట్టు తెలుస్తున్నది. పాత ప్రభుత్వంలో అనుమతులు పొందిన ఇసుక వ్యాపారుల లైసెన్సులు రద్దు చేయడంతోపాటు కొత్తగా మరోసారి క్వారీల నిర్వహణకు టెండర్లు పిలిచే అవకాశాలున్నాయని సమాచారం. అయితే హస్తంలో రాజుకుంటున్న ఇసుక పంచాయితీతో మంజీర పరీవాహకంలో ఎవరికి పెత్తనం అప్పగిస్తారో? అన్న చర్చ జోరుగా నడుస్తున్నది. తాజాగా పార్టీ మారిన ఎమ్మెల్యే, ఓడిన మాజీ ఎమ్మెల్యే, కొత్త ఎమ్మెల్యేతోపాటు కామారెడ్డికి చెందిన కీలక నేతల మధ్య పోటాపోటీగా ఇసుక పంచాయితీ కొనసాగుతున్నట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ప్రస్తుతం క్వారీల మూతతో మంజీరలో ఎలాంటి హడావుడి లేదు. రాత్రివేళలో మాత్రం ట్రాక్టర్లలో అక్రమంగా తరలింపు జరుగుతున్నట్టు సమాచారం.
కామారెడ్డి జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఒక కీలక నేతకు సమీప బంధువైన ఒక మాజీ ఐపీఎస్ అధికారి తనయుడు ఇసుక దందాలో చక్రం తిప్పుతున్నట్టు సమాచారం. కేరాఫ్ హైదరాబాద్‌గా చెప్పుకునే సదరు వ్యక్తులు మంజీరలో ఇసుక క్వారీ అనుమతులను చేతబట్టి దోపిడీ చేస్తున్నారు. వీరి ఆగడాలకు తెర వెనుక అధికార అండదండలున్న ఒక నేత ఉన్నట్టు తెలుస్తున్నది. పోలీసులు, రెవె న్యూ, భూగర్భ గనుల శాఖలకు చెందిన అధికారులుగా తమ వారికే పోస్టింగ్‌లు ఇప్పించుకొని ఇసుక దందాను జోరుగా సాగిస్తున్నారు. ఏరికోరి కళంకిత అధికారులకు మంజీరా పరీవాహకంలో పోస్టింగ్‌లు ఇచ్చి దందా నడిపిస్తున్నారని కాంగ్రెస్‌లోని ఒక వర్గం కోడై కూస్తున్నది. కొత్తగా గెలిచిన ఎమ్మెల్యే ఒకవైపు, కీలక నేత మరోవైపు రంగంలోకి దిగడంతో మిగిలిన చోటా మోటా నేతలంతా నిట్టూరుస్తున్నట్టు సమాచారం. పదేండ్లకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కీలక నేతలే పదవులు దక్కించుకుంటూ, ఇసుక దందాలు చేస్తూ మిగిలిన వారి పొట్ట కొడుతున్నారని వాపోతున్నారు. కామారెడ్డి జిల్లాలో కీలక నేతతోపాటు వారి బంధువుల ఇసుక దందాపై ఏఐసీసీకి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లినట్టు సమాచారం.