తాడ్వాయి, మే 29: సమ్మక్క, సారలమ్మ దేవతలకు కేటాయించిన స్థలాన్ని భద్రకాళి దేవస్థాన పూజారులు ఆక్రమించుకోవాలని చూస్తున్నారని, ఈ ప్రయత్నాన్ని విరమింపజేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ములుగు జిల్లా మేడారంలో అమ్మవార్ల పూజారులు నిరసన తెలిపారు. పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించివన దేవతల ప్రధాన గేటుకు తాళాలు వేశారు.
దేవస్థానానికి వరంగల్లో 1000 గజాల స్థలాన్ని కేటాయించగా, ఇటీవలే ఆ స్థలంలో భద్రకాళి, మెట్టుగుట్ట దేవస్థానం సంయుక్త నిధులతో సెంట్రల్ జైల్ ఎదురుగా ధార్మిక భవనాన్ని నిర్మించారని తెలిపారు. కొద్ది రోజుల నుంచి భద్రకాళి దేవస్థాన అయ్యవార్లు భవనాన్ని ఖాళీ చేయాలని ఒత్తిడి తీసుకువస్తున్నారని ఆరోపించారు. అధికారులు స్పందించకపోతే వచ్చే నెల 5 నుంచి 8 వరకు భద్రాకాళి దేవస్థానం ఎదుట నిరసన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. పూజారుల ధర్నా శిబిరాన్ని మంత్రి సీతక్క సందర్శించారు. సీతక్క హామీ మేరకు పూజారులు ఆందోళన విరమించారు.