హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): మనం ఏదైనా కోర్సు కోసం ఎక్కడ చేరామో అక్కడే పూర్తిచేస్తాం. కానీ, ఒకే కోర్సును సగం మన దేశంలో, మిగతాది విదేశాల్లో పూర్తిచేసే ఎలా ఉంటుంది? ఓ కోర్సులో చేరడం ద్వారా మరో దేశానికి కష్టపడకుండానే స్టడీ వీసా, కొంతకాలం అదే దేశంలో చదువుకొని వస్తే బాగుంటుంది కదా. వినడానికి అద్భుతంగా ఉన్న ఈ అవకాశాన్ని ప్రతిష్ఠాత్మక ఉస్మానియా యూనివర్సిటీ కల్పిస్తున్నది. ట్విన్నింగ్ పీజీ ప్రోగ్రాంలలో భాగంగా ఆస్ట్రేలియా, యూకే, అమెరికా దేశాల్లో చదువుకొనే అవకాశానిస్తున్నది. యూకే పర్యటనలో ఉన్న ఓయూ వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ డీ రవీందర్ ఇదే అంశంపై పలు వర్సిటీలతో ఒప్పందాలు చేసుకొంటున్నారు. యూనివర్సిటీ ఆఫ్ వేల్స్, వెస్ట్రన్ సిడ్నీ ఆస్ట్రేలియా వర్సిటీ, అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్తోను ఒప్పందం చేసుకున్నారు. దీంట్లో భాగంగా విద్యార్థి ఒక సంవత్సరం మన దగ్గర, మరో సంవత్సరం అమెరికాలో చదవాల్సి ఉంటుంది.
పీజీ కోర్సులన్నింటికీ కామన్ ప్రశ్నపత్రాలు
పీజీ కోర్సుల ప్రశ్నపత్రాల రూపకల్పనలో గందరగోళానికి ఓయూ తెరదించింది. పీజీ కోర్సులన్నింటికీ కామన్ ప్రశ్నపత్రాలు రూపొందించాలని నిర్ణయం తీసుకున్నది. ఇప్పటి వరకు డిపార్ట్మెంట్ల వారీగా వేర్వేరుగా ప్రశ్నపత్రాలు ఇస్తున్నారు. దీంతో గందరళానికి దారితీస్తున్నది. దీనికి చెక్‌పెడుతూ అన్నింటికి ఒకేలా ఉండేలా కామన్ క్వశ్చన్పేపర్ను రూపొందించనున్నారు. తాజా విధానంలో సెక్షన్-ఏలో 5 స్వల్పకాలిక ప్రశ్నలుంటాయి. సెక్షన్-బీలో 5 యూనిట్ల నుంచి 10 వ్యాపరూప ప్రశ్నలు ఉంటాయి. అన్ని విభాగాలు ఇదే తరహాలో సెమిస్టర్ ప్రశ్నపత్రాలను రూపొందిస్తాయి.