హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఐదు లోక్‌సభ స్థానాల్లో తమ పార్టీ బలంగా ఉన్నదని, వాటిల్లో ఏదైనా ఒక స్థానం తమకు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీని తాము కోరామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు వెల్లడించారు. హైదరాబాద్ సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తోనే కలిసి వెళ్లాలని నిర్ణయించుకున్నామని, వరంగల్, నల్లగొండ, భువనగిరి, పెద్దపల్లి, ఖమ్మం స్థానాలపై ఫోకస్ పెట్టామని, వీటిలో ఏదో ఒక స్థానం కేటాయించాలని తాము సీఎం రేవంత్‌రెడ్డికి చెప్పినట్టు వివరించారు. పార్లమెంటు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలని కోరారు. ఆ పార్టీతో పొత్తు ఉన్నప్పటికీ ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. హామీల అమలు విషయంలో కొత్త ప్రభుత్వానికి కొంత గడువు ఇవ్వాలని సూచించారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర నేతలు చాడ వెంకటరెడ్డి, అజీజ్‌పాషా పాల్గొన్నారు.