కాశీబుగ్గ, డిసెంబర్ 28: రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపులో మెరిట్ విద్యార్థులకు ఏమైనా అన్యాయం జరిగితే న్యాయం కోసం వినియోగదారుల మండలి ఆధ్వర్యంలో లీగల్ సెల్ ఏర్పాటు చేసినట్టు మండలి జాతీయ ప్రతినిధి సాంబరాజు చక్రపాణి తెలిపారు. రాష్ట్రంలో మూడు మెడికల్ కాలేజీలకు 550 సీట్లు కేటాయించి, డీమ్డ్ యూనివర్సిటీలుగా మారడానికి ఎన్వోసీ ఇవ్వలేదని కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ ఈ నెల 3న వినియోగదారుల మండలికి సమాచారం ఇచ్చినట్టు చక్రపాణి తెలిపారు.
ఈ క్రమంలో డీమ్డ్ వర్సిటీల పేరిట వెబ్ఆప్షన్స్ నుంచి తీసేసిన 550 సీట్లు తిరిగి రాష్ట్ర విద్యార్థులకు కేటాయించాల్సి ఉన్నదని ఆయన సూచించారు. అర్హులు ఎంబీబీఎస్ సీట్లు పొందడానికి అవసరమయ్యే న్యాయ సలహాలు, ఫిర్యాదుల దాఖలుకు హైకోర్టు న్యాయవాది యశ్వంత్‌కుమార్ ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యులతో లీగల్‌సెల్ ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. అన్యాయం జరిగినవారు వివరాలను 9440328239కు మెసేజ్ చేయాలని సూచించారు.