ఖైరతాబాద్, ఫిబ్రవరి 2: సమగ్ర కులగణన సర్వేపై కాంగ్రెస్ సర్కారు అబద్ధాలు వల్లె వేస్తున్నదని, 50 శాతం కూడా పూర్తికాకుండా.. 98 శాతం పూర్తయినట్టు చెప్పడం విడ్డూరమని రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు తెలిపారు. తక్షణమే 15 రోజులపాటు ప్రత్యేక డ్రైవ్ పెట్టి వంద శాతం కులగణన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. బీసీ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి డాక్టర్ కృష్ణమోహన్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీ వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలతో కూడిన మ్యానిఫెస్టో తమకు పవిత్రమైన గ్రంథం లాంటిదని తెలిపారు. బీసీలకు అనేక హామీలిచ్చారని కానీ, వాటిలో ఒక్క హామీ నెరవేర్చలేదని మండిపడ్డారు. రాష్ట్రం లో పాలన గాడి తప్పిందని, పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు రావడం లేదని ఆరోపించారు.
రాష్ట్రంలో నియంతృత్వ పోకడలతో పాలన సాగుతుందని విమర్శించారు. ప్రజలందరూ ఏడుస్తుంటే ప్రజాపాలన అని చెబుతుండటం హాస్యాస్పదమని చెప్పారు. సమగ్ర సర్వే విద్య, ఉద్యోగ, రాజకీయ రంగంతో పాటు వారి స్థితిగతులు అంచనా వేయాడానికి దోహదపడాలని కానీ, అప్పులు, ఆస్తుల గురించి అడగటం ఏమిటని నిలదీశారు. సమగ్ర సర్వేలో ముఖ్యమంత్రి, మంత్రులు వారి ఆస్తులు ప్రకటించారా? అని ప్రశ్నించారు. ఆస్తులను సాకుగా చూపి పేదలకు ఆరోగ్యశ్రీ, రైతుబంధును కట్ చేస్తారా? అని ప్రశ్నించారు.
సుప్రీంకోర్టు గత తీర్పులను సాకుగా చూపించి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు మొండిచెయ్యి చూపించే అవకాశం ఉందని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రిప్యూ పిటిషన్ దాఖలు చేసి, కుల సర్వే గణాంకాలతో వాదనలు వినిపించాలని సూచించారు. సంచార జాతులకు ప్రత్యేకమైన రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చి మర్చిపోయారని గుర్తుచేశారు. బీసీ కమిషన్ ఆ దిశగా ప్రయత్నం చేస్తుం దా? అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో ఓబీసీ మోర్చా డాక్టర్ అధ్యక్షుడు ఆనంద్ గౌడ్, బీసీ సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కాటం నరసింహా యాదవ్ తదితరులు పాల్గొన్నారు.