హైదరాబాద్, సెప్టెంబర్ 28(నమస్తే తెలంగాణ): ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ గురుకుల సొసైటీల్లో పనిచేస్తున్న రికార్టు అసిస్టెంట్లకు చెల్లిస్తున్నట్టే తమకూ వేతనాలు చెల్లించాలని ఎస్సీ గురుకుల సొసైటీల్లో పనిచేస్తున్న రికార్డు అసిస్టెంట్లు ప్రభుత్వాన్ని ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఎస్సీ గురుకులాల్లో అవుట్సోర్సింగ్ పద్ధతిలో 15ఏండ్లకుపైగా రికార్డు అసిస్టెంట్లుగా కొనసాగుతున్నప్పటికీ తమకు సబ్‌స్టాఫ్ కేడర్‌లో వేతనాలు చెల్లిస్తున్నారని వాపోయారు. ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ గురుకులాలు, అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లోని రికార్డు అసిస్టెంట్లకు రూ.19,600 వేతనం చెల్లిస్తుండగా, తమకు కేవలం రూ.15,600 మాత్రమే చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అన్ని సొసైటీల్లో చెల్లిస్తున్నట్టే తమకూ రూ.19,600 చెల్లించాలని కోరారు.
సీపీగెట్‌లో 71% సీట్లు మహిళలకే
హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పీజీ కోర్సుల్లోని సీట్ల భర్తీకి నిర్వహించిన సీపీగెట్ మొదటి విడత వెబ్ కౌన్సెలింగ్‌లో 20,467 సీట్లు భర్తీ అయ్యాయి. 20వేలపైగా సీట్లు భర్తీ అయితే అందులో 14,688 సీట్లను మహిళలే కైవసం చేసుకోగా, పురుషులు 5,779 సీట్లను మాత్రమే దక్కించుకున్నారు. ఈసారి 28,145 మంది వెబ్ ఆప్షన్లు ఎంచుకోగా, 20,467 మంది సీట్లు సొంతం చేసుకున్నారు. సీట్లు పొందిన వారు అక్టోబర్ 8లోగా రిపోర్ట్ చేయాలని ప్రవేశాల కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి సూచించారు.