ముషీరాబాద్, సెప్టెంబర్ 19: కాలేజీ హాస్టళ్లలో పనిచేస్తున్న వర్కర్స్ జీతాలు వెంటనే చెల్లించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఎనిమిది నెలలుగా జీతాల కోసం వర్కర్స్ ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘం ఆధ్వర్యంలో పలువురు వర్కర్స్ విద్యానగర్లోని బీసీ భవన్ వద్ద గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాస్టళ్లలో ఎనిమిది నెలలుగా జీతాలు లేకపోతే కుటుంబాలు ఎలా గడవాలని ప్రశ్నించారు. అవుట్ సోర్సింగ్ విధానం ఎత్తివేసి నేరుగా ప్రభుత్వమే జీతాలు చెల్లించాలని, వర్కర్స్కు రూ.15వేల నుండి రూ.25వేల వరకు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.