Telangana | హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): ఉద్యోగులందరికీ ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పగా చెప్పుకొంటున్నది. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సైతం క్రమం తప్పకుండా వేతనాలు చెల్లిస్తున్నామని గప్పాలు కొడుతున్నది. కానీ, తెలంగాణ వైద్యవిధాన పరిషత్తు పరిధిలో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బందికి ఐదారు నెలలుగా వేతనాలు పెండింగ్లో ఉన్నా సర్కారు పట్టించుకోవడం లేదు. ఫలితంగా దాదాపు 3 వేల కుటుంబాలు పస్తులు ఉంటున్నాయి. పేషెంట్ కేర్, సెక్యూరిటీ, శానిటేషన్ బాధ్యతలను ఏజెన్సీలకు అప్పగించారు.
ఆయా ఏజెన్సీలకు ప్రభుత్వం బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. కానీ, వైద్యారోగ్య శాఖ గత ఆరు నెలలుగా బిల్లులు చెల్లించడం లేదు. దీంతో కాంట్రాక్టర్లు సిబ్బందికి వేతనాలు ఇవ్వడం లేదు. కొన్నిచోట్ల ఒకటి రెండు నెలలు ఇచ్చినట్టు చెప్తున్నారు. మొత్తంగా టీవీవీపీలో పనిచేస్తున్న దాదాపు 3 వేల మంది సిబ్బందికి దసరా నుంచి వేతనాలు లేవని, సంక్రాంతి దాటినా పరిస్థితి మారలేదని వాపోతున్నారు. నెలకు రూ.15 వేలతో కుటుంబాన్ని పోషించుకునే తమను ఇలా నిర్లక్ష్యం చేయడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెల అప్పులు చేయాల్సి వస్తున్నదని, వడ్డీల భారం పెరిగిపోతున్నదని చెప్తున్నారు. కనీసం పండుగలు కూడా చేసుకునే పరిస్థితి లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వం తమకు వేతనాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.