హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ) : దేశంలో ప్రైవేటీకరణను యథేచ్ఛగా ప్రోత్సహిస్తున్న కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు.. తాజా గా సైనిక్ స్కూళ్ల నిర్వహణ బాధ్యతల నుంచి క్రమంగా తప్పుకుంటున్నది. నాణ్యమైన విద్యకు కేరాఫ్ అడ్రస్ అయిన ఈ స్కూళ్లను సైతం ప్రైవేటీకరిస్తున్నది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్(పీపీపీ) విధానంలో కొత్తగా సైనిక్ స్కూళ్లను ఏర్పాటు చేయనున్నది.
కొత్త సైనిక్ స్కూళ్ల ఏర్పాటుకు ఆసక్తిగల ట్రస్టులు, సంస్థలు, ఎన్జీవోల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ఈ గడువు జూలై 14తో ముగియనున్నది. రక్షణ, రైల్వేరంగ సంస్థలు, కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయ సమి తి పరిధిలోని పాఠశాలలు సైతం దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్లో పేర్కొన్నది. ఇప్పటికే దేశంలో 33 సైనిక్ స్కూళ్లు ఉండగా, కొత్తగా 100 స్కూళ్లను ఏర్పాటుచేసే యోచనలో ఉన్నట్టు కేంద్ర రక్షణశాఖ ప్రకటించింది.
ఇప్పటికే విద్యారంగం ప్రైవేట్ చేతుల్లోకి వెళ్లిపోయింది. మిగతావాటిని సైతం వదిలించుకునేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నది. ఇదే క్రమంలో పీపీపీ పద్ధతిలో సైనిక్ స్కూళ్లను నెలకొల్పే ఆలోచనలో ఉన్నది. కనీసం జిల్లాకు ఒక స్కూల్ చొప్పున కొత్తస్కూళ్లను ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. వాస్తవానికి ఈ పాఠశాలల్లో 50%ఫీజులను కేంద్రమే భరిస్తున్నది. మెరిట్ కమ్ మీన్స్ స్కాలర్షిప్ల రూపంలో సహాయం చేస్తున్నది. వీటిల్లో చేరిన వారికి డేస్కాలర్స్ లేదా రెసిడెన్షియల్ పద్ధతిలో విద్యనందిస్తారు.