సైదాబాద్, అక్టోబర్ 14 : సైదాబాద్ జువైనల్ హోంలో జరిగిన లైంగిక దాడి ఘటనను ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకొన్నారు. హోంలో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఐదుగురిపై అధికారులు చర్యలు తీసుకున్నారు. లైంగిక దాడికి పాల్పడ్డ స్టాఫ్ గార్డ్ నిందితుడు అబ్దుల్ రెహమాన్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు. హోం సూపరింటెండెంట్ సయ్యద్ అఫ్జల్‌ను ఆఫ్టర్ కేర్ హోంకు బదిలీ చేసి, ఆయన స్థానంలో కాచిగూడ జువైనల్ గర్ల్స్ హోం సూపరింటెండెంట్ మైథిలికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. అలాగే హెడ్ సూపర్వైజర్ షఫీ అహ్మద్‌ను సస్పెండ్ చేయగా, మరో హెడ్ సూపర్వైజర్ ఖదీర్, హౌస్ మాస్టర్లకు ఛార్జ్ మెమో జారీ చేశారు.
ముమ్మరంగా కొనసాగుతున్న విచారణ
హోంలో లైంగిక దాడిని ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు. ఇప్పటికే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, మైథిలి నివేదిక మేరకు సిబ్బందిపై చర్యలకు ఉపక్రమించారు. సీసీ కెమెరాల పుటేజ్‌లను పరిశీలిస్తూ విచారణ వేగవంతం చేస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు భరోసా సెంటర్లో విచారణ జరిపిన అధికారులు, మరోసారి ఉన్నతాధికారుల సమక్షంలో విచారణ జరుపుతున్నట్టు తెలిసింది. అలాగే మిగతా చిన్నారుల నుంచి వివరాలు సేకరిస్తున్నట్టు సమాచారం. కాగా నిందితుడిపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, జువైనల్ జస్టిస్ యాక్ట్ సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సైదాబాద్ ఇన్స్పెక్టర్ చంద్రమోహన్ తెలిపారు.