Nagarjuna Sagar | హైదరాబాద్, ఏప్రిల్22 (నమస్తే తెలంగాణ): కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ యథేచ్ఛగా మళ్లించుకుపోతున్నా తెలంగాణ సర్కారుకు చీమకుట్టినట్టు కూడా లేకుండాపోయిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ప్రభుత్వం ఎక్కడా నోరెత్తకపోవడంతో ఏపీకి అడ్డే లేకుండా పోయిందని అభిప్రాయం వ్యక్తమవుతున్నది. తాజాగా కేఆర్ఎంబీ నిర్వహించిన సమావేశానికి సైతం రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ ఉన్నతాధికారులు డుమ్మా కొట్టడమూ ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నది. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) నిర్వహణ బడ్జెట్ విడుదలకు సంబంధించి ఇరు రాష్ర్టాలతో సోమవారం కేఆర్ఎంబీ ప్రత్యేక సమావేశాన్ని వర్చువల్గా నిర్వహించింది. ఈ సమావేశానికి ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తొలుత కేఆర్ఎంబీ విడుదల చేయాల్సిన నిధులకు సంబంధించి ఏపీ ఈఎన్సీ మాట్లాడారు. ఇప్పటికే తెలంగాణ కంటే బోర్డుకు 8 కోట్లను అదనంగా విడుదల చేశామని, అదీగాక ప్రస్తుతం ఓటాన్ అకౌంట్ ఉన్న నేపథ్యంలో నిధులను విడుదల చేసే పరిస్థితి లేదని వివరించారు. తెలంగాణ తన కోటా నిధులను విడుదల చేసిన అనంతరం తాము విడుదల చేస్తామని బోర్డు చైర్మన్కు ఆయన స్పష్టం చేశారు.
మరో 2.5 టీఎంసీలు ఇవ్వండి
ఇటీవల నిర్వహించిన త్రీమెంబర్ కమిటీ సాగర్లో వినియోగానికి 14 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయని తేల్చింది. అందులో తెలంగాణకు 8.5 టీఎంసీలను, ఏపీకి 5.5 టీఎంసీలను కేటాయించింది. ఏపీ కోటాకు సంబంధించి 5.5 టీఎంసీల నీటి విడుదల మంగళవారంతో పూర్తికానున్నది. దీంతో బోర్డు అధికారులు సాగర్ కుడికాలువ గేట్లను బంద్ చేయాల్సి ఉన్నది. అయితే తాజా సమావేశంలో ఏపీ అందుకు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. గతంలో కోటాకు సంబంధించి ఏపీకి 2.5 టీఎంసీలు రావాల్సి ఉన్నదని తెలిపి, ఆ మేరకు సాగర్ నుంచి ప్రస్తుతం కుడికాలువ ద్వారా విడుదల చేస్తున్న నీటిని 26 వరకు కొనసాగించాలని ఈఎన్సీ నారాయణరెడ్డి కోరినట్టు సమాచారం. దీనిపై బోర్డులో భిన్నభిప్రాయాలు వెలువడుతున్నాయి. బోర్డు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే ఏపీ సర్కారు ఇటీవల సాగర్ టెయిల్పాండ్ ప్రాజెక్టు నుంచి అక్రమంగా 3 టీఎంసీలను తరలించుకుపోయింది. తాజాగా నాగార్జున సాగర్ నుంచి మరో 2.5 టీఎంసీలను డిమాండ్ చేస్తున్నది. ఆయా అంశాలపై బోర్డు సమావేశంలో లేవనెత్తాల్సిన తెలంగాణ రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ అధికారులు మాత్రం ఏకంగా ఆ సమావేశానికి హాజరుకాకపోవడం గమనార్హం.