హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కూడా కుంకుమపువ్వు సాగు సాధ్యమని నిరూపించామని శ్రీకొండాలక్ష్మణ్ ఉద్యాన వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ దండ రాజిరెడ్డి తెలిపారు. రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందించేందుకు వర్సిటీ ఎంతో కృషి చేస్తుందని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అందులో భాగంగా కశ్మీర్లో చల్లని వాతావరణంలో పండే కుంకుమపువ్వును విశ్వవిద్యాలయం పరిధి కళాశాలలో పైలట్ ప్రాతిపదికన చేపట్టామని వివరించారు.
ఈ నూతన టెక్నాలజీని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ త్వరలోనే పరిచయం చేస్తామని వెల్లడించారు. నాబార్డ్ ఆధ్వర్యంలో నూతన పరిజ్ఞానాన్ని అందరికీ అందించే పథకాలు చేపడుతున్నామని నాబార్డు చీఫ్ జనరల్ ఉదయ్‌భాస్కర్ తెలిపారు. వర్సిటీకి కుంకుమపువ్వు ప్రాజెక్టు నిధులు అందించామని పేర్కొనారు. ఏరోపోనిక్ పద్ధతిలో ప్రాజెక్టును చేపట్టామని ప్రాజెక్టు ప్రధాన సైంటిస్ట్ పిడిగం సైదయ్య తెలిపారు.