హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : హోటళ్లకు వచ్చే మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత నిర్వాహకులదేనని ఉమెన్ సేఫ్టీ వింగ్ డీజీ శిఖాగోయెల్ పేర్కొన్నారు. సోమవారం ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో ఓయో, ట్రిబో, ఫ్యాబ్ హోటళ్ల నిర్వాహకులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. సరైన ఐడీ ధ్రువీకరణ, సీసీటీవీ బ్యాకప్ వ్యవధి 90 రోజులకు పొడిగించడం, అన్ని గదులు, రిసెప్షన్లలో అత్యవసర పరిస్థితుల్లో పోలీసులను సంప్రదించే సమాచారం ఉండాలని ఆదేశించారు. అతిథులందరికీ చెక్-ఇన్ కోసం ఒరిజినల్ ఐడీకార్డ్‌లు తప్పనిసరి చేయాలన్నారు. అన్ని సీసీ కెమెరాలు పని చేస్తున్నాయా? లేదా? అనేది అగ్రిగేటర్లు ఆడిట్ నిర్వహించాలన్నారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలు, అనుమానాస్పద ప్రవర్తన గమనించిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఐజీ రెమా రాజేశ్వరి, ఓయో హోటల్స్ రీజినల్ హెడ్ ఆశిష్ సౌరవ్, ఆపరేషనల్ మేనేజర్ సోవానా ష్రాఫ్, ట్రీబో హోట్సల్ రీజినల్ హెడ్ అనుపమ్ సబాత్, ఆపరేషనల్ మేనేజర్ దీప్జైన్, ఫ్యాబ్ హోటల్స్ రీజినల్ హెడ్ ఇంతియాజ్, ఆపరేషనల్ మేనేజరల్ ఫరూక్ పింజారి, హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ నోడల్ అధికారులు పాల్గొన్నారు.
ప్రైవేటు వినియోగదారుల కోసం ప్రత్యేక టెర్మినల్
శంషాబాద్ రూరల్, సెప్టెంబర్ 2 : ప్రైవేటు విమాన వినియోగదారుల కోసం జీఎంఆర్ సంస్థ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక జనరల్ ఏవియేషన్ టెర్మినల్‌ను సోమవారం సీఈవో ప్రదీప్‌ఫణికర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనరల్ ఏవియేషన్ టెర్మినల్ వ్యాపార, వ్యక్తిగత ప్రయాణాల కోసం ఉద్దేశించిన చార్టర్డ్ విమానాల ద్వారా ప్రయాణించే అవకాశాలను కల్పిస్తున్నట్టు చెప్పారు. 11,234 చదరపు అడుగుల విస్తీరరంలో ఉన్న జీఏ టర్మినల్లో ప్రైవేటు ప్రవేశద్వారం, పార్కింగ్ ఉంటాయని తెలిపారు. నేరుగా విమానంలోకి చేరే విధంగా డ్రైవర్‌తో నడిచే రవాణాను ఏర్పాటు చేశామని వెల్లడించారు.