జహీరాబాద్, జూలై 25: ప్రస్తుతం ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఇంటా.. బయటా.. విద్యుత్ (Electricity) ప్రమాదాలు జరిగే అవకాశలెక్కువ. గాలివానకు స్తంభాలు పడిపోయి.. విద్యుత్ తీగలు తెగిపడి.. ఎక్కడ ఎలాంటి ముప్పు పొంచి ఉంటుందో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో రైతులు, ప్రజలు కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే వాటి బారి నుంచి తప్పించుకోవచ్చని జహీరాబాద్ విద్యుత్‌శాఖ డీఈఈ లక్ష్మీనారాయణ సూచిస్తున్నారు. ముఖ్యంగా వర్షాలు కురిసే సమయంలో భారీగా వీచే ఈదురు గాలులు, వర్షాల వల్ల విద్యుత్తు లైన్లు తెగిపోవడం, గాలి వానలకు చెట్లు విరిగిపోవడం జరుగుతుంటాయి. ఈ క్రమంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా విద్యుదాఘాతం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు.