జూబ్లీహిల్స్, మే 1: ఎన్సీపీహెచ్ రోగికి సురక్షిత ప్రసవాన్ని అందించి రెయిన్బో, స్టార్ హాస్పిటల్స్ వైద్యబృందం తల్లీబిడ్డలను కాపాడింది. ఫైనాన్షియల్ డిస్టిక్ట్‌లోని స్టార్ హాస్పిటల్లో నాన్-సిరోటిక్ పోర్టల్ హైపర్ టెన్షన్(ఎన్సీపీహెచ్)తో బాధపడుతున్న ముఫ్పై ఏండ్ల గర్భిణి రెయిన్బో హాస్పిటల్ క్లినిక్‌కు 17 వారాల గర్భంతో వచ్చింది. ఆమెకు ఆర్‌సీఎస్‌తో గ్రేడ్ 3 వేరిస్లు, విస్తరించిన ప్లీహము, తక్కువ ప్లేట్లెట్ కౌంట్ (కేవలం 35,000) ఉన్నట్టు గుర్తించారు. ఇదివరకు అధిక రక్తస్రావం, స్పాంటేనియస్ అబార్షన్, ప్రీ మెచ్యూర్ డెలివరీ వంటి సంభావ్య సమస్యలను ఎదుర్కొంది. చివరికి కాన్పుకు దగ్గరపడే సమయానికి ఆమెకు సిజేరియన్ కూడా జరిగింది. రెయిన్బో, స్టార్ హాస్పిటల్స్‌కు చెందిన మల్టీ డిసిప్లినరీ వైద్య బృందం ఆమె ఆరోగ్యంపై అధ్యయనం చేసింది. అధిక రక్తస్రావం నివారించడానికి, చికిత్స సమయంలో.. ఆ తరువాత అనుకూలంగా మార్గనిర్ధేశం చేసేందుకు వైద్యులు థ్రోంబోలాస్టోగ్రఫీ (టీఈజి)ని ఉపయోగించారు. దీంతో శస్త్రచికిత్స నుంచి తల్లి, బిడ్డ క్షేమంగా బయటపడ్డారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని స్టార్ హాస్పిటల్ కన్సల్టెంట్ హెపటాలజీ అండ్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ ఫిజిషియన్ డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ హిమబిందు మాట్లాడుతూ ఎన్సీపీహెచ్ రోగికి సురక్షిత ప్రసవాన్ని అందించడం ఖచ్చితమైన ప్రణాళిక, సమష్టి కృషితో సాధ్యమైందన్నారు. తల్లి, శిశువు క్షేమంగా ఉండడం సంతోషకరమన్నారు.