హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ) : ప్రజాసమస్యలు, ప్రభుత్వ హామీలపై మాట్లాడేందుకు అసెంబ్లీలో తమకు మైక్ ఇవ్వడం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత సబిత్రాఇంద్రారెడ్డి ఆరోపించారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో బీఆర్ఎస్ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా వాయిదా వేస్తున్నారని విమర్శించారు. జీరో అవర్‌ను గంటలు గంటలుగా నడిపిస్తూ టైమ్‌పాస్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. సోమవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కోవ లక్ష్మి, చింతా ప్రభాకర్, మాణిక్‌రావులతో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడారు. ప్రశ్నించేవారిని సీఎం రేవంత్‌రెడ్డి టార్గెట్ చేస్తున్నారని మం డిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా సభలో అధికార పార్టీ సభ్యులు, మంత్రులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ రెండున్నరేండ్లలో ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ కుంభకోణాలను సభ దృష్టికి తీసుకొస్తున్న కేటీఆర్, హరీశ్‌రావులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షంగా ప్రజల సమస్యలను ఎత్తిచూపితే కులాన్ని తీసుకొచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారని సబితాఇంద్రారెడ్డి విమర్శించారు. స్పీకర్‌ను మేం దళితుడు అని అనుకోం అని స్పష్టంచేశారు. కులాల ప్రస్తావన తెచ్చి సమాధానం చెప్పకుండా సీఎం రేవంత్‌రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. రైతుబంధు, యూరియా, నీళ్లు వస్తలేవని అడుగొద్దా? అని నిలదీశారు. మూసీ పేరుతో పేదల ఇండ్లను కూల్చొద్దని, మూసీకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న భూములను లాక్కోవద్దని సూచించామని తెలిపారు. రేవంత్‌రెడ్డికి దమ్ముంటే రాఘవ మైనింగ్‌పై హౌస్ కమిటీ వేయాలని సబితాఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ‘కోకాపేటలో మైనింగ్ పర్మిషన్ ఇచ్చారా?. అక్రమంగా మైనింగ్ జరిగితే అధికారులు సీజ్ చేయాలి. సీజ్ చేయకుండా ఫైన్ వేస్తారా?. ఇవన్నీ అడిగితే బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లలో ఏం చేసిందో విచారణ చేస్తామని బెదిరిస్తున్నారు. మీబ్లాక్ మెయిల్‌కు మేం భయపడాలా?’ ఎన్ని విచారణలు చేసినా ప్రజల పక్షాన పోరాడుతాం’ అని సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం నిజంగా ఎలాంటి తప్పుచేయకుంటే, సీఎం దమ్ముంటే రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమ మైనింగ్‌పై హౌస్ కమిటీ వేయాలి. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి’ అని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో సభ నిర్వహణ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని దుయ్యబట్టారు. అక్రమ మైనింగ్‌పై సభా సంఘం వేయాలని అడిగితే బీఆర్ఎస్ సభ్యులకు మైక్ ఇవ్వలేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి దేశంలో ఒక నీతి, రాష్ట్రంలో మరో నీతి ఉంటుందా? అని ప్రశ్నించారు. రాఘవ కన్స్ట్రక్షన్స్కు మైనింగ్ చేయడానికి ఎలాంటి పర్మిషన్లు లేవని, సీజ్ చేసి యజమానులను జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. పొంగులేటిని రక్షించడానికి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు తహతహలాడుతున్నారని ఎద్దేవా చేశారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్ సీఎం చెవిలో ఏదో మాట్లాడుకొని.. ఆ తర్వాత వా రు సభలో మాట్లాడుతుంటే, దానం, కడియం ఏ పార్టీకి చెందిన వారని పాడి కౌశిక్‌రెడ్డి అడిగారని తెలిపారు. అంతమాత్రం దానికే అతనిపై ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేయడమేంటి? అని ప్రశ్నించారు. నిజంగా ఎథిక్స్ కమిటీ చర్యలు తీసుకుంటే ముందుగా సీఎం రేవంత్‌రెడ్డిపై తీసుకోవాలని డిమాండ్ చేశారు. కడియం శ్రీహరి ఏ కులానికి చెందినవాడు? ఏ సామాజిక వర్గానికి చెందినవాడంటూ గతంలో రేవంత్ మాట్లాడిన వీడియోను ఈ సందర్భంగా చూపించారు.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీని నడిపిస్తున్న తీరు బాధాకరమని, అసెంబ్లీలో ప్రజల సమస్యలపై మాట్లాడనివ్వడం లేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఉపనేత హరీశ్‌రావుపై సీఎం ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆరోపించారు. మైనింగ్‌పై మాట్లాడుతామంటే మైక్ ఇవ్వమంటున్నారని, ప్రజలకు ఇచ్చిన హామీలపై మా ట్లాడితే సమాధానం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కడియం శ్రీహరి మాట్లాడే సమయంలో ఏ పార్టీ అని కౌశిక్‌రెడ్డి అడిగారని, అందులో తప్పేముందని సునీతాలక్ష్మారెడ్డి ప్రశ్నించారు. మైనింగ్ అంశాన్ని డైవర్ట్ చేసేలా సభను నడిపారని విమర్శించారు.