హైదరాబాద్: సిట్టింగ్ మంత్రి కూతురు ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై (Sabitha Indra Reddy) ఆరోపణలు చేస్తే ఎందుకు వివరణ ఇవ్వలేదని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. ఆరోపణలపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డికి ఉందన్నారు. ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడే ఈ సెటిల్మెంట్లో కూర్చున్నాడంటే కచ్చితంగా రేవంత్ రెడ్డికి ఇందులో హస్తం ఉంటుందని చెప్పారు. ఏ సిమెంట్ కంపెనీ డైరెక్టర్‌ను బెదిరించారో అతని స్టేట్మెంట్ పోలీసులు తీసుకున్నారా, ఒక వేళ తీసుకుంటే అది ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. నిందితుడు మంత్రి కొండా సురేఖ ఇంట్లో ఎందుకు ఉన్నాడని, అతని ఎందుకు ఆశ్రయం ఇవ్వడం సరైనదేనా అని ప్రశ్నించారు. నిందితుడిని మంత్రి తన కారులో తీసుకెళ్తే పోలీసులు చర్యలు తీసుకోరా అన్నారు. ఈ అంశంలో అసలేం జరిగింది, ఎక్కడ సెటిల్మెంట్ జరిగిందన్నారు. టేబుల్‌పై గన్ పెట్టి బెదిరించారని, ముఖ్యమంత్రే స్వయంగా తుపాకీ ఇచ్చారని చెబుతున్నారని, ఈ గన్ కల్చర్ ఎక్కడి నుంచి వచ్చిందని, ఎందుకు ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ మహిళా నేతలతో కలిసి తెలంగాణ భవన్లో సబితా ఇంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘మిస్ వరల్డ్ పోటీల్లో మహిళకు అన్యాయం జరిగితే దానిపై క్లారిటీ లేదు.
సీఎం సొంత నియోజకవర్గంలో మహిళా జర్నలిస్టులపై కేసులు పెట్టారు. నిండు సభలో మహిళా ఎమ్మెల్యేలను సీఎం అవమానించారు. తాజాగా మాగంటి సునీతపై మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణం. క్యాబినెట్ మంత్రి ఇంటిపైకి పోలీసులు వెళ్లారు. రాష్ట్రంలో మహిళల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి ఇది నిదర్శనం. నాడు కేసీఆర్ హయాంలో అన్ని వర్గాలు అభివృద్ధి చెందాయి. నేడు రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతున్నది. రాష్ట్రంలో గన్ కల్చర్ తెచ్చారు. మంత్రి ఇంటి పైకి అర్థ రాత్రి పోలీసులు వెళితే దానిపై ఎఫ్ఐఆర్ ఉందా, పోలీసులు దీనిపై ఎందుకు మౌనం వహిస్తున్నారు. డీజీపీ దీనిపై సమాధానం చెప్పాలి. నిందితుడిని మంత్రి కారులో తీసుకుపోతే ఎందుకు కేసు పెట్టలేదు?. సీఎం స్వయంగా గన్ ఇచ్చారని మంత్రి కూతురు ఆరోపిస్తే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు?. సిమెంట్ కంపెనీ యజమాని దగ్గర ఫిర్యాదు తీసుకున్నారా?. ఈ అంశంలో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. డీజీపీ అధికారంలోకి వచ్చాక ఏ బుక్ లేదు.. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం అన్నారు. స్వయంగా సీఎంపైనే ఆరోపణలు వస్తున్నాయి. మంత్రులపై ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. క్యాబినెట్ సమావేశంలో ఏ మంత్రి వాటా ఎంత అనే దానిపై చర్చిస్తున్నారు. దీనిపై గవర్నర్ జోక్యం చేసుకోవాలి.
కాంగ్రెస్ ఇన్చార్జితో మాట్లాడుకున్నామరి ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇది పార్టీ వ్యవహారం కాదు. ప్రజలకు సంబంధించింది. మేడారం జాతర పనులు ఒక శాఖ నుంచి మరో శాఖకి ఎందుకు మార్చారు?. సిమెంట్ కంపెనీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలి. మంచిరేవుల భూముల వ్యవహారంలో సీఎం సోదరులపై ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రంలో ఇంత జరుగుతుంటే బీజేపీ నేతలు ఎందుకు స్పందించడం లేదు. కేంద్ర మంత్రులు ఇద్దరు ఉండి ఎందుకు విచారణ జరపరు?. బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి గన్ కల్చర్‌పై ఎందుకు విచారణకు ఆదేశించరు’ అని సబిత ప్రశ్నించారు.
రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సీఎం ఇంటి సమీపంలో గన్‌తో బెదిరించే పరిస్థితి నెలకొందని చెప్పారు. హరీశ్ రావు కాబినెట్ సమావేశంపై మాట్లాడితే మంత్రి సీతక్క తల్లిదండ్రులపై ఎందుకు ప్రమాణం చెయ్యాలన్నారు. మేడారం పనులు తమకు దక్కలేదని మీరు అనలే దా అని ప్రశ్నించారు. మీ నియోజకవర్గంలోని కలెక్టరేట్లో మహిళా ఉద్యోగి పట్ల లైంగిక వేధింపులపై ఎందుకు స్పందించలేదని నిలదీశారు. మాగంటి సునీతపై మంత్రుల వ్యాఖ్యలు దౌర్భాగ్యం. మంత్రి కూతురే ఆరోపణలు చేస్తుంటే మీ పాలన ఎలా ఉందో ప్రజలకి అర్థం అవుతుందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఏ ముఖంతో సంబురాలు చేసుకుంటారని మండిపడ్డారు.
Live : BRS Leaders press meet at Telangana Bhavan https://t.co/GFxdURh8ct
— BRS Party (@BRSparty) October 19, 2025