MLA Sabitha | హైదరాబాద్, మార్చి22 (నమస్తే తెలంగాణ): గత బీఆర్ఎస్ ప్రభుత్వం చొరవతో తెలంగాణకు వచ్చిన ఫాక్స్‌కాన్ కంపెనీలో ప్రస్తుతం 18-20 ఏండ్ల లోపు వయసున్న, పెండ్లికాని యువతులే ఉద్యోగానికి అర్హులనే నిబంధన విధించిందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. ఆ నిబంధనను తొలగించేలా చొరవ చూపాలని ప్రభుత్వానికి సూచించారు. అసెంబ్లీలో శనివారం ప్రశ్నోత్తరాల సమయంలో మహిళా ఆంత్రప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్‌కు సంబంధించి పలు ప్రశ్నలను ఆమె లేవనెత్తారు. ఫాక్స్‌కాన్ కంపెనీ కేవలం పెండ్లికాని మహిళలకే అవకాశం కల్పిస్తున్నదని తెలిపారు. దీంతో కంపెనీ చుట్టుపక్కల నివాసముంటున్న, ఉన్నత చదువులు చదివి, ఉద్యోగాలు చేయాలని ఆసక్తి ఉన్న వివాహిత మహిళలకు నిరాశే ఎదురవుతున్నదని తెలిపారు. 14 వేల ఎకరాల్లో ఏర్పాటుచేస్తున్న ఫ్యూచర్ సిటీలో మహిళలకు 100 ఎకరాలు కేటాయించాలని, డ్వాక్రా మహిళలకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.
సిద్దిపేట, సిరిసిల్ల అన్నితీర్ల డెవలపైంది
ఇండస్ట్రియల్ పార్క్‌లో ఎలాంటి వివక్ష చూపకుండా అన్ని నియోజకవర్గాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్న బీఆర్ఎస్ సభ్యుల కోరిక మేరకు మంత్రి శ్రీధర్‌బాబు స్పందించారు. సిద్దిపేట, సిరిసిల్ల, ప్రశాంత్‌రెడ్డి నియోజకవర్గాలు అన్ని తీర్ల అభివృద్ధి అయ్యాయని వివరించారు. అవసరాన్ని బట్టి అక్కడ కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రతిపాదనలను పెడితే పరిశీలిస్తామని చెప్పారు.
ఆంక్షలుంటే చర్యలు తీసుకుంటం: శ్రీధర్‌బాబు
ఫాక్స్‌కాన్ కంపెనీలో పెండ్లికాని యువతులనే తీసుకోవాలనే నిబంధన లేదని, ఒకవేళ ఉంటే తగిన చర్యలు తీసుకుంటామని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. సభలో సభ్యులు సబితా ఇంద్రారెడ్డి, తోల లక్ష్మీకాంతం, కసిరెడ్డి నారాయణరెడ్డి, రామచంద్రనాయక్ లేవనెత్తిన వివిధ ప్రశ్నలకు మంత్రి బదులిచ్చారు. మహిళా ఆంత్రపెన్యూర్లకు, ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రాయితీల గురించి వివరించారు. 880 ఎకరాల్లో 1,02,703 మొబిలిటీ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటుచేసి 4 లక్షల మందికి ఉపాధి కల్పించాలని ప్రణాళికలను సిద్ధంచేశామన్నారు.