హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): సింగరేణి సంస్థలో జరిగిన బొగ్గు కుంభకోణం వివరాలు బయటపెట్టాలని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఆమె తెలంగాణభవన్‌లో మాజీ మంత్రి సత్యవతిరాథోడ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. నైని బొగ్గు టెండర్లతోపాటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బావమరిది టెండర్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేసినందుకే ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్‌రావుకు నోటీసులు ఇచ్చారని సబితాఇంద్రారెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కార్ చేసిన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే ఈ డ్రామా పాలిటిక్స్ అని విమర్శించారు. బొగ్గు కుంభకోణం వ్యవహారంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి జోక్యం చేసుకొని సీబీఐ లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటిందని, వచ్చే మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ సత్తా చాటుతుందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో రేవంత్ రాజ్యాంగం: సత్యవతి రాథోడ్
రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి సొంత రాజ్యాంగం అమలవుతున్నదని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ విమర్శించారు. పోలీసు వ్యవస్థను అడ్డంపెట్టుకుని రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని దుయ్యబట్టారు. బొగ్గు స్కామ్‌ను బయటపెట్టారనే అక్కసుతోనే ప్రభుత్వం హరీశ్‌రావుకు నోటీసులు ఇప్పించిందని మండిపడ్డారు. రాష్ట్రాన్ని కాపాడాల్సిన మంత్రులే, ఏ విధంగా దోచుకుంటున్నారో హరీశ్‌రావు బట్టబయలు చేశారని పేర్కొన్నారు. ఇలాంటి అక్రమ కేసులకు భయపడేది లేదని స్పష్టంచేశారు. అవినీతిని బయటపెడుతూనే ఉంటాం: ఉమ
సీఎం రేవంత్‌రెడ్డి అవినీతి బండారాన్ని ఎప్పటికప్పుడు బయటపెడుతూనే ఉంటామని జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ తుల ఉమ హెచ్చరించారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. హరీశ్‌రావుపై కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు.
కేసులకు భయపడేది లేదు: సుమిత్ర ఆనంద్
అక్రమ కేసులకు బీఆర్ఎస్ భయపడదని బీఆర్ఎస్ నేత సుమిత్ర ఆనంద్ పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను అమలుచేయలేక కాంగ్రెస్ విచారణల పేరిట డ్రామాలు ఆడుతున్నదని విమర్శించారు. విచారణ పేరుతో కొండను తవ్వి కనీసం ఎలుకను కూడా పట్టడం లేదని ఎద్దేవా చేశారు.