హైదరాబాద్: రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పరువును, భారతదేశ ప్రతిష్టను మంటగలిపిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy) విమర్శించారు. హైదరాబాదులో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలపై.. మిస్ ఇంగ్లండ్ మిల్లా మ్యాగీ సంచలన వ్యాఖ్యలు చేశారని తెలిపారు. మధ్య వయసు ఉన్న పురుషులను ఆనందపెట్టాలని తమపై ఒత్తిడి తీసుకువచ్చారని, తమను వేశ్య లాగా చూశారంటూ ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ పోటీల నుంచి మధ్యలోనే తప్పుకుని స్వదేశానికి వెళ్లిపోయారని చెప్పారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన మిస్ వరల్డ్ పోటీల్లో ఇలాంటి ఘటనలు జరగడం.. అది కూడా మన రాష్ట్రంలో జరిగినప్పుడే తెరపైకి రావడం ప్రభుత్వ తీరుపై, నిర్వాహకుల తీరుపై అనేక అనుమానాలను కలిగిస్తున్నదని చెప్పారు.
చాలా గ్రాండ్గా ఈ వేడుకలు నిర్వహిస్తామని, పోటీదారులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూస్తామని, ఈ పోటీలతో పెట్టుబడులు వస్తాయని, యువతకు ఉద్యోగాలు వస్తాయంటూ ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు.. మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ ఆరోపణలకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇది కేవలం నిర్వాహకులపై చేసిన ఆరోపణ కాదని, మన రాష్ట్ర రాజధానిలో పోటీలు జరుగుతున్నాయి కాబట్టి ఇది మన రాష్ట్ర ప్రతిష్టకు, మన దేశ పరువు, ప్రతిష్టలకు సంబంధించిన విషయమన్నారు. దీనిపై వెంటనే విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.
ప్రపంచ దేశాల నుంచి వచ్చిన యువతులను వేధించింది ఎవరు, ఆ వేధింపులకు కారణమైంది ఎవరు?, ఆ వ్యక్తులు ఎవరు అనే విషయాలు బయటకు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. దీనిపై వెంటనే రాష్ట్ర మహిళా కమిషన్ స్పందించి విచారణ చేపట్టాలన్నారు. అలాగే జాతీయ మహిళా కమిషన్ కూడా ఈ అంశంలో జోక్యం చేసుకోవాలని, రాష్ట్ర, దేశ పరువు ప్రతిష్టలను కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రపంచ దేశాల నుంచి పోటీల కోసం వచ్చిన యువతులతో అసభ్యంగా ప్రవర్తించిన వారు, వారితో అసభ్యకరమైన పనులు చేయించాలని ప్రయత్నించిన వారు ఎంతటి వారైనా వారిపై కఠిన చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేశారు. దీనిపై ప్రభుత్యం స్పందించాలన్నారు.