హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): రెండేండ్ల పాలనలో దివ్యాంగులకు కాంగ్రెస్ సర్కారు ధోకా ఇచ్చిందని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి మండిపడ్డారు. ఆరు వేల పింఛన్ ఇస్తామని, వెల్ఫేర్‌బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి మొండి చెయ్యి చూపిందని ఆరోపించారు. కేసీఆర్ పాలనలోనే అట్టడుగు వర్గాలకు సంక్షేమ ఫలాలు అందాయని గుర్తుచేశారు. రూ. 500 పింఛన్‌ను రూ. 4 వేలు పెంచి దివ్యాంగుల అభ్యున్నతికి పెద్దపీట వేసిన ఘనత బీఆర్ఎస్ సర్కారుకే దక్కిందని కొనియాడారు. బుధవారం తెలంగాణ భవన్లో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై దివ్యాంగులకు శుభాకాంక్షలు తెలిపారు. మలిదశ తెలంగాణ పోరాటంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డికి మైక్ దొరికితే చాలు కేసీఆర్‌ను తిట్టడం తప్ప ఆయన ఉద్ధరించింది ఏమీలేదని విమర్శించారు. కేసీఆర్ అప్పులు తెచ్చి చేపట్టిన అభివృద్ధి పనులు, పేదలకు అందించిన సంక్షేమ ఫలాలు కండ్లముందరే కనిపిస్తున్నాయని చెప్పారు. కానీ రేవంత్ ప్రభుత్వం రెండేండ్లలో రూ. 2.5 లక్షల కోట్ల అప్పులు చేసి అభివృద్ధి చేసింది ఏమీలేదని దుయ్యబట్టారు. దివ్యాంగుల పింఛన్లు పెంచుతామని ఇచ్చిన హామీని సైతం విస్మరించారని ధ్వజమెత్తారు. దివ్యాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి దివ్యాంగుల దినోత్సవాన్ని జరపాలనే సోయి కూడా లేకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. గతంలో మాదిరిగానే బీఆర్ఎస్కు దివ్యాంగుల మద్దతు కొనసాగాలని కోరారు.
కాంగ్రెస్ దివ్యాంగులకు ఇచ్చిన హామీల అమలు కోసం బీఆర్ఎస్ తరఫున పోరాడుతామని దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి స్పష్టంచేశారు. కేసీఆర్ పాలనలో 5.15 లక్షల మంది దివ్యాంగులకు పింఛన్ ఇచ్చేవారని గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత 25 వేల మందికి కోతపెట్టి మోసం చేసిందని ఆరోపించారు. పింఛన్ మొత్తాన్ని పెంచుతామని ఇచ్చిన హామీని విస్మరించిందని మండిపడ్డారు.
దివ్యాంగులకు కాంగ్రెస్ సర్కారు బాకీపడ్డ పింఛన్ మొత్తాన్ని మెడలు వంచి వసూలు చేస్తామని హెచ్చరించారు. కేసీఆర్ కంటికిరెప్పలా కాపాడుకున్న దివ్యాంగులను రేవంత్ అడుగడుగునా అవమానపరుస్తున్నారని నిప్పులు చెరిగారు. దివ్యాంగుల సంక్షేమానికి చిత్తశుద్ధితో పనిచేసే పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టంచేశారు. సమావేశంలో మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, దివ్యాంగుల యూనియన్ నేత మున్నా, బీఆర్ఎస్ నేతలు అజీం, మన్నె గోవర్ధన్, అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి, కిశోర్‌గౌడ్ పాల్గొన్నారు.