చేవెళ్ల రూరల్, అక్టోబర్ 4 : తన కుమారులకు ఫాంహౌస్లు ఉన్నట్టు సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారని, అవి ఎక్కడున్నాయో ఆయనే చెబితే బాగుంటుందని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం ఆమె రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని స్వగ్రామమైన కౌకుంట్లలో మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఏది మాట్లాడాలో, ఏది మాట్లాడకూడదో తెలియని పరిస్థితిలో రేవంత్ రెడ్డి ఉన్నారని విమర్శించారు. తన కుమారులకు ఫాంహౌస్లు ఉన్నాయని సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించడం సరికాదన్నారు. అవి ఎకడున్నాయో ఆయనే స్వయంగా చూపిస్తే బాగుంటుందని డిమాండ్ చేశారు. ఫాంహౌస్లు ఉన్నాయని నిర్ధారిస్తే చట్టరీత్యా కూల్చివేసుకోవచ్చని సూచించారు. లేనివి ఉన్నట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సీఎం రేవంత్రెడ్డి బాధ్యతతో మాట్లాడితే బాగుంటుందని సూచించారు.