హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): యాసంగి సీజన్ రైతుబంధు శాటిలైట్ సర్వే ఆధారంగా పంట వేసిన భూములకే రైతుబంధు అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రబీ సీజన్ సమయానికి శాటిలైట్ చిత్రాల ద్వారా పంట విస్తీర్ణాన్ని అంచనా వేయగలిగే సాంకేతికతను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో వ్యవసాయాధికారులతో పత్తి కొనుగోళ్లు, యాసంగిలో యూరియా నిల్వలు, జొన్న నిల్వల తరలింపు తదితర అంశాలపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సాంకేతికత అందుబాటులోకి వస్తే, సాగు విస్తీర్ణం ప్రకారం రైతుభరోసా నిధులు జమ చేయడం సులభం అవుతుందని పేర్కొన్నారు. గత యాసంగిలో మార్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన జొన్నలను వెంటనే తరలించాలని అధికారులకు సూచించారు.