హైదరాబాద్, ఏప్రిల్ 18(నమస్తే తెలంగాణ) : రాష్ట్ర వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 21 నుంచి 23 వరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రైతు మహోత్సవం నిర్వహించనున్నట్టు వ్యవసాయశాఖ సంచాలకుడు డాక్టర్ బీ గోపీ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని స్థానిక జీజీ కాలేజీ గ్రౌండ్స్‌లో జరిగే మహోత్సవాన్ని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ప్రారంభించనున్నట్టు తెలిపారు. మూడు రోజులపాటు జరిగే కార్యక్రమంలో తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల రైతులు, వారు పండించిన ఉత్పత్తులతోపాటు వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల ఉత్పత్తులు సైతం ప్రదర్శనలో ఉంచనున్నట్టు వెల్లడించారు. సుమారు 150 స్టాల్స్ ఏర్పాటుచేయనున్నట్టు వెల్లడించారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, ప్రగతిశీల అవార్డు గ్రహీతలతో నూతన సాంకేతికత పద్ధతులపై మూడ్రోజులు వర్‌షాప్ ఉంటుందని తెలిపారు.