హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): ‘ప్రజలారా.. కాంగ్రెస్ను నమ్మి మోసపోతే గోస పడ్తం. రైతు పంటలకు నీళ్లియ్యరు. మోటర్లకు కరెంటు రాదు. రైతుబంధు, రైతుబీమాకు రామ్ రామ్. తెలంగాణకు శాశ్వత శత్రువు ఎవరైనా ఉన్నారంటే అది ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీనే’ అని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పదే పదే కేసీఆర్ ప్రస్తావించారు. ఇప్పుడు అదే నిజమైంది. రైతులను కరెంటు కష్టాలు, నీళ్ల కష్టాలు చుట్టుముట్టి గోసపెడుతుండగా, రైతుబంధు ఆగమైంది. ఓ మహోన్నత లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘రైతుబీమా’ పథకానికి రేవంత్రెడ్డి సర్కార్ మరణశాసనం రాసింది. ఏదైనా కారణంతో మరణించిన రైతుల కుటుంబాలకు ఆర్థికంగా భరోసా ఇచ్చే మానవీయ కార్యక్రమాన్ని చూసి కండ్లల్లో నిప్పులు పోసుకున్నారు.
కేసీఆర్కు పేరు వస్తున్నదనే ఉక్రోషంతో రైతుబీమా పథకం అమలును నిలిపివేశారు. 2018లో కేసీఆర్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించినప్పటి నుంచి ఏటా ఆగస్టు 14న ప్రీమియం చెల్లించేవారు. ప్రభుత్వం మారిన తర్వాత మొక్కుబడిగా కొనసాగించిన కాంగ్రెస్ సర్కార్.. ఈ నెల 14న ప్రీమియం చెల్లించలేదు. ఫలితంగా ఈ పథకం పూర్తిగా అటకెక్కినట్టేనని అధికారవర్గాలు తెలిపాయి. కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబీమా ఎన్నో కుటుంబాలకు ఆర్థికంగా ఆశాదీపంగా మారింది. ఇందుకు గణాంకాలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. బీఆర్ఎస్ సర్కార్ ఎల్ఐసీ సాయంతో 2018-19లో ఈ పథకాన్ని ప్రారంభించింది.
2023-24 వరకు రూ.6,8 60 కోట్ల ప్రీమియం చెల్లించింది. ఈ కాలంలో వివిధ కారణాలతో మరణించిన 1,33,601 మంది రైతుల కుటుంబాలకు పరిహారంగా రూ.6,680.05 కోట్లు అందాయి. కుటుంబ పెద్దను కోల్పోయినవారికి రూ.5 లక్షలు ఆపద్బంధువుగా నిలిచాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏటా రైతుబీమా ప్రీమియం చెల్లింపునకు కొర్రీలు పెడుతూ వచ్చింది. రెండేండ్లలో రూ. 2,792.89 కోట్లు ప్రీమియంగా చెల్లించింది. ఈసారి 42.16 లక్షల మంది రైతుల కోసం రూ.1,400 కోట్ల ప్రీమియం చెల్లించాల్సి ఉండగా, ప్రభుత్వం మౌనంగా ఉన్నది. దీంతో రైతాంగం ఆందోళన చెందుతున్నది.
కేసీఆర్ ఆనవాళ్లను తుడిచివేయాలని ఆరాటపడుతున్న సీఎం రేవంత్రెడ్డి.. రైతుబీమాకు మంగళం పాడారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పేరుతో ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తామని ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. ఈ నేపథ్యంలో రైతుబీమా ప్రీమియం చెల్లించలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి కుటుంబ బీమా పథకాన్ని ఈ ఏడాది జూన్ 2న ప్రారంభించాలని ప్రయత్నించారు. కానీ కార్యరూపం దాల్చలేదు. దీంతో మళ్లీ నవంబర్ 19న ఇందిరాగాంధీ జయంతి రోజున ప్రారంభించాలని భావిస్తున్నట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఈ పథకానికి లబ్ధిదారుల ఎంపిక, పూర్తిస్థాయి వివరాల కోసం ఇంటింటి సర్వే చేపడుతామని చెప్తున్నారు. మరి సర్వే ఎప్పుడు ప్రారంభం అవుతుంది? విధివిధానాలేమిటి? అనేది ఇంకా ఖరారు చేయకపోవడం గమనార్హం.
రైతుబీమాకు ప్రీమియం చెల్లించకపోవడంతో ఆగస్టు 14 తర్వాత ఏవైనా కారణాలతో రైతులు మరణిస్తే వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా అందదని నిపుణులు చెప్తున్నారు. మరి ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకం అమలయ్యేలోగా ఎవరికైనా ఏదైనా జరిగితే ఆ కుటుంబం పరిస్థితి ఏమిటి? అని రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఆర్థికభరోసా లేక కుటుంబాలు రోడ్డునపడుతాయని, చిన్నాభిన్నమైపోతాయని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికే రైతుల ఆత్మహత్యలు పెరిగాయని గుర్తుచేస్తున్నారు. దీనికితోడు నీళ్లు, కరెంటు, యూరియా కష్టాలతో రైతులు పుట్టెడు దుఃఖంలో ఉన్నారని పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో కొత్త పథకాన్ని ప్రారంభించకముందే, రైతుబీమాను పూర్తి గా రద్దు చేయడం దారుణమని విమర్శిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే మేల్కొని రైతుబీమా ప్రీమియం చెల్లించి రైతులకు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.