సారంగాపూర్, ఏప్రిల్ 1 : అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20వేలు పరిహారం ఇవ్వాలని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంటల బీమా పథకం అమలు చేసి ఉంటే కనీసం ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారానైనా పరిహారం అందేదని చెప్పారు. బుధవారం జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలంలోని అర్పల్లి, లక్ష్మీదేవిపల్లి, ధర్మానాయక్తండాల్లో పర్యటించి అకాల వర్షానికి దెబ్బతిన్న మక్క, నువ్వు, కూరగాయల పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతులు రూ. వేలల్లో పంట పెట్టుబడులు పెట్టారని, పంట చేతికి వచ్చే సమయంలో ప్రకృతి వైపరీత్యాలతో పంటలు పూర్తిగా దెబ్బతినడం దురదృష్టకరమని ఆవేదన చెందారు.
మక్క, నువ్వు, కూరగాయలు దెబ్బతిని, మామిడి కాయలు రాలిపోయినా ఇంతవరకు ప్రభుత్వం సర్వే చేయకపోవడంపై మండిపడ్డారు. కలెక్టర్ వెంటనే స్పందించి నష్ట పోయిన పంటలను అంచనా వేసి పరిహారం అందేలా చూడాలని కోరారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతు భరోసా అమలు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో మక్క కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభిస్తే రైతులకు ఆత్మైస్థెర్యం కలుగుతుందని చెప్పారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో ఫోన్లో మాట్లాడుతూ.. జగిత్యాల జిల్లాలో మక్క పంట అధికంగా ఉందని, అకాల వర్షాలతో రైతులు పంటలు నష్టపోయారని వివరించారు. కలెక్టర్‌తో నివేదిక తెప్పించుకుని ప్రభుత్వపరంగా ప్రకటన చేయించాలని సూచించారు.
హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాల వల్ల నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించాలని తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి టీ సాగర్ డిమాండ్ చేశారు. వర్షాల వల్ల వరి, మకజొన్న, మామిడి తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు. వాణిజ్య పంటలకు ఎకరానికి రూ. 50 వేలు, ఆహారధాన్యాలకు ఎకరాకు రూ.25 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.