ఖమ్మం, జూన్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రైతుభరోసా నిధులు ఈసారి రైతుల ఖాతాల్లో ఒకేసారి జమ చేయనున్నట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో సీఎం పర్యటన ఏర్పాట్లను గురువారం పరిశీలించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. మధిర నియోజకవర్గ పరిధిలోని చింతకాని మండలంలో ఈ నెల 30న ఏర్పాటు చేసిన రైతు ఆశీర్వాద సభలో రైతు భరోసా నిధులను సీఎం విడుదల చేస్తారని చెప్పారు.
వచ్చే వ్యవసాయ సీజన్‌కు యూరియా కొరత రానివ్వమని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 6 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. యాప్‌లో బుక్ చేసుకున్న వెంటనే యూరియా వచ్చేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. త్వరలో వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల్లో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీలను ప్రారంభించనున్నట్టు తెలిపారు. రైతులు వర్షాభావ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని అనుగుణమైన పంటలు వేయాలని సూచించారు.
హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ) : ఒకవైపు, యూరియా యాప్ వద్దు మొర్రో అని రైతులు మొత్తుకుంటున్నారు. కానీ, అదే యాప్ చాలా గొప్ప ఆవిష్కరణ అని చెప్పుపుకొంటున్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఈ యాప్ వల్ల రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేదని కూడా చెప్పుకొస్తున్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే యూరియా యాప్‌ను బంగాళాఖాతంలో పడేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించిన నేపథ్యంలో రైతుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న అదే యాప్‌ను మంత్రి తుమ్మల సమర్థించుకోవడం గమనార్హం.
వ్యవసాయరంగంలో అమలు చేస్తున్న సంస్కరణల్లో యూరియా యాప్ అంత్యంత కీలకమైనదని అభివర్ణించారు. రైతులు స్వచ్ఛందంగా ఈ యాప్‌ను స్వీకరించారని తెలిపారు. గతంలో ఆధార్ ఆధారంగా చేపట్టిన విక్రయ విధానంతో పెద్దఎత్తున అక్రమాలు జరిగాయని, ఒకే వ్యక్తి పలుమార్లు తీసుకోవడం, బ్లాక్‌మార్కెట్‌కు తరలించడంతో యూరియా దుర్వినియోగమైందని పేర్కొన్నారు.