హైదరాబాద్, ఆగస్టు 6(నమస్తే తెలంగాణ): వానకాలం సీజన్ రైతుభరోసా (రైతుబంధు) పెట్టుబడి సాయం పంపిణీపై ప్రభుత్వం చేతులెత్తిసినట్టే కనిపిస్తున్నది. పెట్టుబడి సాయం ఇప్పట్లో ఇవ్వలేమని, ఆలస్యమవుతుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. రైతుభరోసా విధి విధానాలపై రైతులు, మేధావులతో అభిప్రాయ సేకరణ పూర్తి కాలేదని తెలిపారు. మంగళవారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రైతుభరోసాపై చర్చలు జరుపుతున్నామని, పంట వేసిన రైతులకు మాత్రమే పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం భావిస్తున్నదని వెల్లడించారు. ఇందుకోసం రైతులు, రైతు సంఘాల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికి ఐదారు ఉమ్మడి జిల్లాల్లో మాత్రమే అభిప్రాయ సేకరణ పూర్తయిందని, మరో మూడు నాలుగు జిల్లాలు మిగిలి ఉన్నాయని పేర్కొన్నారు. శాసనసభ సమావేశాల కారణంగా అభిప్రాయ సేకరణ వాయిదా పడినట్టు తెలిపారు. అభిప్రాయ సేకరణ పూర్తయిన తర్వాత నిజమైన, పంట వేసిన రైతులకు మాత్రమే ఇవ్వాలనేదే ప్రభుత్వ ఆలోచన అని స్పష్టంచేశారు. దీంతోపాటు రైతులు, కౌలు రైతుల అంశంపై కూడా స్పష్టత రావాల్సి ఉన్నదని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో పంట వేయని భూములకు రైతుబంధు రూ.25 వేల కోట్లు ఇచ్చారని, వాటిని రికవరీ చేయబోమని స్పష్టంచేశారు.
వానకాలం సీజన్ ప్రారంభమై రెండు నెలలు కావొస్తున్నది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా రైతులు సాగు పనుల్లో బీజీ అయిపోయారు. సగం పంటల సాగు కూడా పూర్తయింది. దీంతో రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. సాగు సమయంలో పెట్టుబడి సాయం పంపిణీ చేస్తే ఎరువులు, విత్తనాలు, దుక్కి ఖర్చులు, కూలీలకు ఇలా ఏదో ఒకరకంగా రైతులకు ఆ డబ్బులు ఉపయోగపడుతాయి. రైతుబంధు (రైతుభరోసా) ముఖ్య ఉద్దేశం కూడా ఇదే. కానీ ప్రభుత్వం మాత్రం పెట్టుబడి సాయంపై కాలయాపన చేసే దిశగా సాగుతున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రైతుభరోసాపై ప్రభుత్వం కావాలనే ఆలస్యం చేస్తున్నదనే విమర్శలొస్తున్నాయి. ఇందుకు అభిప్రాయ సేకరణ అని ఒకసారి, అసెంబ్లీలో చర్చ అని మరోసారి, మంత్రుల కమిటీ అని ఇంకోసారి సాకులు చెప్తున్నదనే విమర్శలున్నాయి. మొన్నటివరకు రైతుభరోసాపై అసెంబ్లీలో పూర్తిస్థాయిలో చర్చించి ఆ తర్వాత రైతులకు పెట్టుబడి సాయం పంపిణీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డితోపాటు పలువురు మంత్రులు ప్రకటించారు. కానీ అసెంబ్లీలో రైతుభరోసా అంశమే చర్చకు రాలేదు. మంత్రులతో సబ్ కమిటీ వేశామని, ఆ కమిటీ అసెంబ్లీ సమావేశాల వరకు అన్ని జిల్లాలు పర్యటించి రైతుల అభిప్రాయాలు సేకరించి నివేదిక ఇస్తుందని, దాని ఆధారంగానే పంపిణీ చేస్తామని చెప్తూ వచ్చారు. అసెంబ్లీ సమావేశాలు పూర్తయినా, మంత్రుల కమిటీ నివేదిక మాత్రం ప్రభుత్వానికి అందలేదు.