హైదరాబాద్, మార్చి 4(నమస్తే తెలంగాణ): సుబాబుల్ రైతులకు రైతుబంధు సమితి చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అండగా నిలిచారు. భద్రచాలం ఐటీసీ కంపెనీ అధికారులతో శనివారం ప్రత్యేకంగా భేటీ అయ్యి వారి సమస్యల పరిష్కారంపై చర్చించారు. అంతకుముందు సుబాబుల్ పండించే రైతులు పల్లా రాజేశ్వర్‌రెడ్డిని కలిసి తమ సమస్యను విన్నవించారు. పంటకు సరైన మద్దతు ధర ఇవ్వడం లేదని, 2014 నుంచి క్రమంగా తగ్గిస్తున్నారని తెలిపారు.
ఖర్చులు పెరిగి, రాబడి తగ్గడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోయారు. దీంతో స్పందించిన ఎమ్మెల్సీ వెంటనే ఐటీసీ అధికారిణి ఉషారాణి దృష్టికి రైతుల సమస్యలను తీసుకెళ్లారు. రైతులకు ప్రకటించిన మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాలని, దళారుల బెడదను నివారించాలని కోరారు. దీనిపై స్పందించిన ఆమె విచారణ జరిపి 15 రోజుల్లోగా సమస్యలను పరిష్కస్తానని హామీ ఇచ్చారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేసి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.