నమస్తే తెలంగాణ నెట్వర్క్, జనవరి 8: పంట పెట్టుబడి సాయం తమ ఖాతాల్లో జమ అవుతుండటంతో రైతన్నలు సంబురపడుతున్నారు. సాగుకు సన్నద్ధమవుతున్న తరుణంలో ఖర్చులకు సర్కారు సాయం ఉపయోగపడుతుండటంతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు అభినందనలు తెలుపుతున్నారు. రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా ఎద్దులను అందంగా అలంకరించి గ్రామాల్లో ఎడ్లబండ్లతో ర్యాలీ లు తీస్తున్నారు. మహిళలు, విద్యార్థినులకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు. తమకు అండగా నిలిచిన కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేస్తున్నారు.
తమ సాగు కష్టాలను తీర్చిన రైతుబాంధవుడు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతూ రైతులు స్వచ్ఛందగా వేడుకలు జరుపుకొంటున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలంలోని చౌదర్పల్లిలో నిర్వహించిన ఎండ్లబండ్ల ర్యాలీలో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 63 లక్షల మంది రైతుల ఖాతాల్లో యాసంగికి రూ.7,500 కోట్ల పంట సాయం జమ చేశామని చెప్పారు. నాలుగేండ్లలో రూ.50,600 కోట్లు రైతుబంధు ఇచ్చామని స్పష్టంచేశారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర పరిధిలోని రాంపల్లి దయారా గ్రామంలో కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ఎండ్ల బండ్ల ర్యాలీలో పాల్గొన్నారు. హైదరాబాద్ యూసుఫ్‌గూడలోని స్టేట్‌హోంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో గిరిజనశాఖ మంత్రి సత్యవతిరాథోడ్ రైతుబంధు పతంగులను ఆవిష్కరించారు. దేశ చరిత్రలోనే ఎవరూ చేయనివిధంగా రైతుల కోసం పెట్టుబడి సమకూరుస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని చెప్పారు.
రైతుబంధు వారోత్సవాలు ఊరూరా ఉత్సాహంగా జరుపుకొంటున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలం కన్నెకల్‌లో ఎమ్మెల్యే నోముల భగత్, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి పాల్గొన్నారు. పీఏపల్లి మండలం అంగడిపేటలో ఉత్తమ రైతులను ఎమ్మెల్యే రవీంద్రకుమార్ సన్మానించారు. నకిరేకల్ మండలం ఓగోడులో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో రైతులు సీఎం ఫ్లెక్సీకి క్షీరాభిషేకంచేశారు. నల్లగొండ మండలం పానగల్లో ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి సంబురాల్లో పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా నడిగూడెంలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ఆధ్వర్యంలో రైతుబంధు సంబురాలు నిర్వహించారు.
రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధు సంబురాలు సంక్రాంతి పండుగ వరకు నిర్వహించాలని నిర్ణయించినట్టు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ వెల్లడించారు. తొలుత ఈ నెల 10 వరకు నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ కరోనా ఆంక్షల నేపథ్యంలో పూర్తిగా చేయలేకపోతున్నామని తెలిపారు. ప్రభుత్వం ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతి నిరారించినందున గతంలో సూచించిన మేరకు కొవిడ్ నింబంధనలు పాటిస్తూ రైతుబంధు ఉత్సవాలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు.