హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం దూసుకెళ్తున్నది. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా)లో నమోదవుతున్న రిజిస్ట్రేషన్లు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కొనుగోలుదారుల ప్రయోజనాలు కాపాడేందుకు ప్రభుత్వం రెరా చట్టాన్ని తీసుకొచ్చింది. రియల్టర్లు 8, అంతకుమించిన ఫ్లాట్లు, 500 చదరపు మీటర్లకు మించిన స్థలంలో చేపట్టే నిర్మాణాలకు ఈ చట్టం వర్తిస్తుంది. ఇది అమల్లోకి వచ్చిన తర్వాతి నుంచి ఇప్పటి వరకు 6,754 ప్రాజెక్టులు నమోదయ్యాయి. కరోనా ప్రభావంతో 2020, 2021లో కొంత నెమ్మదించినా, ఏడాది కాలంగా ప్రాజెక్టులు మళ్లీ ఊపందుకున్నాయి.
ఈ ఏడాది ఇప్పటికే 2,140 ప్రాజెక్టులు రిజిస్టర్ అయ్యాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉండడం, పెద్ద ఎత్తున పరిశ్రమలు తరలివస్తుండడంతో అందుకు అనుగుణంగా ‘రియల్’ రంగంలోనూ విక్రయాలు జోరందుకున్నాయి. క్రయవిక్రయాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. రెరా అనుమతులు ఉన్న వాటి వైపే వినియోగదారులు మొగ్గుచూపుతుండడంతో బిల్డర్లు, లే అవుట్లు చేసే సంస్థలు రెరా వద్ద నమోదు చేసుకుంటున్నాయి. వినియోగదారులను ఆయా సంస్థలు మోసం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉండడంతో రెరా పట్ల ప్రజల్లో విశ్వసనీయత పెరుగుతున్నది.