Telangana | హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ హయాంలో పల్లె ప్రగతి పరుగులు పెట్టింది. ప్రతి గ్రామం మెరిసింది. జాతీయ పంచాయతీరాజ్ పురస్కారాల్లో మన గ్రామాలకు అవార్డుల పంట పండింది. కేంద్ర సర్కారు 46 అవార్డులు ప్రకటిస్తే.. ఇందులో 13అవార్డులు తెలంగాణ రాష్ర్టానికే దక్కాయి. దేశ జనాభాలో మూడు శాతం ఉన్న తెలంగాణకు 30శాతం అవార్డులను సాధించింది. మరో ఏడాది ఏకంగా 19 పురస్కారాలు గెలుచుకున్నది. అత్యధిక అవార్డులతో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 2014నుంచి 2024 వరకు అంటే పదేండ్లలో తెలంగాణ పల్లెలు మొత్తం 69 అవార్డులు సాధించాయి. జిల్లా పరిషత్‌లు 8, మండల పరిషత్‌లు 17జాతీయ అవార్డులు కైవసం చేసుకున్నాయి. మొత్తం 94 పురస్కారాలు దక్కించుకున్నాయి. ఇదంతా గతం. కేసీఆర్ హయాంలో మెరిసి.. మురిసిన పల్లెలు నేడు వెలవెలబోతున్నాయి. కాంగ్రెస్ పాలనలో గ్రామాల్లో కనీస వసతులు కల్పించలేని పరిస్థితి దాపురించింది. జాతీయ పంచాయతీ అవార్డు ఒక్కటీ సాధించడం గగనంగా మారింది. అంటే.. పల్లెల్లో పరిస్థితి ఎంత దారుణంగా మారిందో దీనిని చూస్తే అర్ధమవుతున్నది.
కేంద్ర ప్రభుత్వం దీన్‌దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ స్వశక్తి కరణ్ (డీడీయూపీఎస్వీపీ) 2021-22 జాతీయ పంచాయతీ అవార్డులను ప్రకటించింది. మొత్తం తొమ్మిది అంశాల ఆధారంగా నాలుగు క్యాటగిరీల్ల్లో అవార్డులు ప్రకటించగా అత్యధికంగా తెలంగాణలోని గ్రామాలకే వచ్చాయి. మొదటి, రెండోస్థానంలోనే రాష్ట్ర పంచాయతీలు నిలిచాయి. డబుల్ ఇంజిన్ సర్కారుగా చెప్పుకునే బీజేపీ పాలిత రాష్ర్టాలను తలదన్నేరీతిలో అవార్డుల్లో తెలంగాణ టాప్‌లో నిలిచింది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఐదు అవార్డులు, ఆ తర్వాత వరుసగా 8 అవార్డుల చొప్పున తెలంగాణ తన ఖాతాలో వేసుకున్నది. 2018-19లో 10 అవార్డులు, ఆ తర్వాత 12 అవార్డులు, 2020-21 సంవత్సరంలో అవార్డుల్లో కొత్త చరిత్ర సృష్టించింది. ఏకంగా19 అవార్డులు సాధించింది. 2021-22లో 13 అవార్డులు సాధించింది. ఎక్కువ అవార్డులు దక్కుతున్నాయని తెలంగాణకు ప్రాధాన్యం తగ్గించడం, తొమ్మిది అంశాలను పరిగణనలోకి తీసుకోకపోవడం, మండల పరిషత్‌లు, జి ల్లా పరిషత్‌లకు అవార్డులు నిలిపివేయడం మూలంగా 2022-23లో ఒక్కటే అవార్డు దక్కింది. ఆ తర్వాతి సంవత్సరంలో రెండు క్యాటగిరీల్లో రెండు ప్రతిపాదనలు పంపగా, ఒక్క అవార్డు చిక్కింది.
ఒకటి కాదు.. రెండు.. ఎనిమిది అంశా ల్లో మన పంచాయతీలు స్వయం సమృద్ధి సాధించాయి. అవార్డు పంట పండించాయి. ఆరోగ్యవంతమైన పంచాయతీ, నీటి సమృద్ధి ఉన్న పంచాయతీ, సామాజిక భద్రత ఉన్న పంచాయతీ, మహిళల సన్నిహిత పంచాయతీ, పేదరిక నిర్మూలన, జీవనోపాధి పెంచిన పంచాయతీ, సుపరిపాలన, క్లీన్ అడ్ గ్రీన్ పంచాయతీ.. ఇలా ఎనిమిది అంశాల్లో తెలంగాణ గ్రామాల్లో అవార్డులు జాతీయ అవార్డులు సాధించాయి. అనేక పల్లెలు సర్వతోముఖాభివృద్ధి సాధించాయి. మరోవైపు దేశంలో వందశాతం బహిరంగ మల మూత్ర విసర్జనరహిత (ఓడీఎఫ్) ప్లస్ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. గ్రామీణ స్వచ్ఛ సర్వేక్షణ్‌లోనూ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది.
కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేసిన పల్లె ప్రగతి మూలంగానే జాతీయ అవార్డుల పంట పండింది. ప్రతి గ్రామానికి ట్రాక్టర్, వైకుంఠధామం, పల్లె ప్రకృతివనం, నర్సరీ, డంపింగ్ షెడ్ ఏర్పాటుతోపాటు పంచాయతీ కార్యదర్శిని నియమించారు. కేంద్రంతో సమానంగా నిధులను విడుదల చేశారు. ప్రతిగ్రామంలో ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ద్వారా రక్షిత తాగునీరు అందించారు. నూతన పంచాయతీ చట్టాన్ని తీసుకొచ్చి మొక్కల పెంపకానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. నాటిన మొక్కల్లో 85శాతం మొక్కలు బతకాల్సిందేనని చట్టంలో పొందుపర్చారు. దీంతో ప్రతిపల్లె నందనవనంగా మారింది. తెలంగాణలోని గ్రామాలు, పట్టణాలు అన్ని కూడా అభివృద్ధి బాట పట్టాయి. జాతీయ అవార్డులే ఇందుకు నిదర్శనం.
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ జాతీయ స్థాయిలో ఉత్తమ పంచాయతీగా ఎంపిక కాగా గురువారం బీహార్‌లోని మధుబనిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆ పంచాయతీ కార్యదర్శి రాజు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఆత్మ నిర్భర్ భారత్ పంచాయతీ ప్రత్యేక విభాగంలో మాల్ జాతీయ ఉత్తమ అవార్డుకు ఎంపికైన విషయం తెలిసిందే.
పదేండ్ల కేసీఆర్ పాలనలో ప్రతి పల్లె సింగిడి సకల సౌకర్యాలతో వర్ధిల్లితే.. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నది. స్థానిక సంస్థలకు ఎన్నికల నిర్వహించకపోవడంతో పట్టించుకునే నాథుడు లేక గ్రామాలు అనాథల్లా మారాయి. కేంద్రం నుంచి, 15వ ప్రణాళికా సంఘం నుంచి కూడా నిధుల విడుదల నిలిచిపోయింది. పంచాయతీ కార్మికులకు సకాలంలో జీతాలు అందడం లేదు. ఇప్పటికే మూడు నెలల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. బ్లీచింగ్ పౌడర్ కొనుగోలు కూడా కార్యదర్శి చేతిలో చిల్లిగవ్వ ఉండటం లేదు. మురుగు కాల్వలు పొంగిపొర్లుతున్నాయి. నీళ్లు పోసే దిక్కు లేక కేసీఆర్ హయాంలో నాటిన మొక్కలు ఎండిపోతున్నాయి. అనేక చోట్ల తాగునీటి కోసం ఖాళీ బిందెలతో రోడ్డు ఎక్కుతున్న మహిళల ఫొటోలు మళ్లీ మీడియాలో కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పాలనలో ఇలాంటి దారుణ పరిస్థితులు ఉన్నందున ఇక రాష్ర్టానికి కేంద్ర అవార్డులు రావడం కష్టతరంగా మారనున్నది.