వనపర్తి : తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ అనుకూల విధానాలు అవలంభిస్తుండడం వల్ల పల్లెలు పచ్చగా మారి ప్రగతిపథంలో పయనిస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి మండలం ఈదులచెరువు నుంచి మెట్పల్లి నందిమల్ల గడ్డకు సాగునీరు అందించేందుకు పూర్తిచేసిన మినీ ఎత్తిపోతల పథకాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా నష్టపోయిన రైతాంగం ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని పేర్కొన్నారు. వనపర్తి పట్టణానికి సమీపాన ఉన్న వ్యవసాయ భూములలో సాగునీటి రాకతో కూరగాయలు, వేరుశెనగ సాగును పండిస్తున్నారని తెలిపారు.2014లో తెలంగాణలో 68 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్న వరి ధాన్యం ఉత్పత్తి ఎనిమిదేళ్లలో 2.5 కోట్ల మెట్రిక్ టన్నులకు పెరిగిందని అన్నారు. రైతులు ప్రతియేట రెండు పంటలు పండిస్తుండడంతో రైతులు, రైతుకూలీలకు చేతి నిండా పని దొరుకుతుందని వెల్లడించారు.
నాడు పనుల కోసం వలసలు వెళ్లగా నేడు ఈ ప్రాంతానికి వలసలు వస్తున్నారని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరంటు, సాగునీటి సదుపాయం మూలంగా వ్యవసాయం లాభసాటిగా మారి రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలు దేశానికి దిక్సూచి మారాయని తెలిపారు.దేశవ్యాప్తంగా రైతాంగాన్ని చైతన్యం చేసి బీజేపీ పాలనను ఎండగడతామని అన్నారు.