హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ) : వైకల్యంతో బాధపడుతున్న ఎంతోమంది అభాగ్యులకు ఆ కేఫ్ చేయూతనిస్తున్నది. స్వశక్తితో నిలబడి, ఆర్థికంగా నిలదొకుకోవడానికి నైపుణ్యాలు, శిక్షణను అందిస్తున్నది. ఇలా దేశవ్యాప్తంగా స్వర్ణభ మిత్ర అనే మహిళ 40కి పైగా మిట్టీ కేఫ్‌లు ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్, సుప్రీంకోర్టు కాంప్లెక్స్, పలు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో మిట్టీ కేఫ్ మంచి ఆదరణ పొందుతున్నది. ఈ కేఫ్‌ను సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం ఆవరణలోనూ ఏర్పాటు చేశారు. శీతాకాల విడిదికి వచ్చినప్పుడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా కేఫ్‌ను సందర్శించి, నిర్వహకులను అభినందించారు.
మిట్టీ కేఫ్‌లలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాల్లో ఆధునిక శైలిలో చేతితో రూపొందించిన గృహ, కార్యాలయ అలంకరణ పరికరాలు, పిల్లల ఆట వస్తువులు, నోటు పుస్తకాలు, పెన్నులు విక్రయిస్తున్నారు. సమోసా, చాట్, పకోడీ, మసాలాటీ, బిస్కెట్లు, కాఫీ, మ్యాగీ, శాండ్విచ్, ఐస్రీమ్స్, చిరుతిండ్లు లభిస్తాయి. రాష్ట్రపతి నిలయాన్ని చూసేందుకు వచ్చే పర్యాటకులు మిట్టీ కేఫ్‌ను కూడా సందర్శించేలా అధికారులు నిబంధన పెట్టారు.
రాష్ట్రపతి నిలయంలోని మిట్టీ కఫ్‌ను 15 మంది దివ్యాంగులు నిర్వహిస్తున్నారు. వీరికి నెలకు పనిని బట్టి రూ.15 వేల నుంచి రూ.50 వేల రూపాయల వరకు వేతనం ఇస్తున్నారు. ఆర్థిక స్వావలంబన, ఆత్మ గౌరవంతో జీవించేందుకు, కుటుంబ పోషణకు మిట్టీ కేఫ్ అం డగా ఉందని నిర్వాహకురాలు జీ స్వాతి తెలిపారు. సామాజిక దృక్పథం గల సంస్థలతోపా టు సెలెబ్రిటీలు చేయూతనిస్తున్నట్టు చెప్పారు. కేఫ్ నిర్వహణకు అవసరమైన పెట్టుబడి ఖర్చులను సీఎస్ఆర్ కింద ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ బ్యాంకింగ్ గ్రూప్ లు భరిస్తున్నాయి. ఈ కేఫ్ ఏర్పాటుకు తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ చొరవ తీసుకుంది. దీంతో ఏడాదికి రూ.36 నుంచి 46 లక్షల టర్నోవర్ సాధిస్తామని నిర్వహకులు విశ్వాసం వ్యక్తంచేశారు.