వరంగల్, ఆగస్టు 25 (నమస్తేతెలంగాణ): దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్వగ్రామం వరంగల్ జిల్లా గీసుగొండ మండలం వంచనగిరిలో అన్నదాతలకు జరిగిన రుణమాఫీ తీరు.. కాంగ్రెస్ సర్కారు డొల్లతనానికి అద్దంపడుతున్నది. 681 మంది వంచనగిరి పీఏసీఎస్ ద్వారా రుణాలు పొందారు. రుణమాఫీకి వీరంతా అర్హులేనని అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. ప్రభుత్వ ం మూడు విడతల్లో రూ.2 లక్షల రుణమాఫీ చేయ గా వంచనగిరి పీఏసీఎస్ నుంచి రుణం పొందిన వారిలో 200 మందికి మాత్రమే మాఫీ వర్తించిం ది. మిగతా 481 మంది మాఫీ కోసం పీఏసీఎస్ చుట్టూ తిరుగుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదిస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, త్వరలోనే మాఫీ అవుతుందని చెబుతున్నారు.
వంచనగిరి పీఏసీఎస్ అధికారుల నిర్లక్ష్యం, అక్రమాలు, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం వల్ల గ్రామంలో 481 మంది రైతులకు మూడు విడతల్లోనూ రుణమాఫీ జరగలేదని తెలిసింది. వంచనగిరి నుంచి 50 మంది రైతులు 2023 డిసెంబర్ 9లోపు రుణాలను పొందగా.. వంచనగిరి పీఏసీఎస్ అధికారులు 2023 డిసెంబర్ 9 తర్వాత నమోదు చేశారు. దీంతో ఈ యాభై మంది రైతులు రుణమాఫీకి దూరం కావాల్సి వచ్చింది.
రుణమాఫీ వర్తించని రైతుల్లో పలువురు 2023 డిసెంబర్ 9లోగా గతంలో తీసుకున్న రుణాలను వడ్డీతో సహా చెల్లించి కొత్తగా మళ్లీ రుణం పొందితే.. వంచనగిరి పీఏసీఎస్ అధికారులు పాత రుణాలను చెల్లించి కొత్తగా రుణాలను పొందిన రైతుల పేర్లను పేర్కొనలేదు. రైతులు చెల్లించిన పాత రుణాల డబ్బు ఏమైంది? ఆ రుణాలను వడ్డీ సహా చెల్లించిన రైతులకు పీఏసీఎస్ అధికారులు ఇచ్చిన రసీదులు నకిలీవా? అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. రుణమాఫీని కోల్పోయిన రైతులు అధికారుల తీరుపై మండిపడుతున్నారు.
నేను వంచనగిరి పీఏసీఎస్‌లో రెండు విడతల్లో రూ.25 వేల రుణం తీసుకున్న. ప్రభుత్వం రుణమాఫీ చేసిన సమయంలో కొంత రుణం మాఫీ అయింది. వడ్డీ సహా మొత్తం రుణం చెల్లించాలని అధికారులు అడగ్గా 2023 సెప్టెంబర్ 4న రూ.55,700 పీఏసీఎస్‌లో చెల్లించి రశీదు తీసుకున్న. అదే నెల 29న ఇదే పీఏసీఎస్ నుంచి కొత్తగా రూ.1.5 లక్షల రుణం పొందాను. తాజాగా ప్రభుత్వం మూడు విడతలుగా చేసిన రుణమాఫీలో అర్హత ఉన్నా 1.5 లక్షల రుణం మాఫీ కాలేదు. గత సెప్టెంబర్ 4న చెల్లించిన రూ.55,700 పాత రుణానికి సంబంధించిన రుణం వడ్డీ సహా రూ.58,254 మాఫీ అయింది. 2023 సెప్టెంబర్ 4 నుంచి ఇటీవల ప్రభుత్వం రుణమాఫీ చేసే వరకు రూ.55,700కు వడ్డీ రూ.2,554 కావటం వల్ల నాకు మాఫీ రూ.58,254 వర్తించింది.
ఇదేమిటని నేను వంచనగిరి పీఏసీఎస్ కార్యాలయానికి వెళ్లి అడిగాను. సెప్టెంబర్ 4న చెల్లించిన రూ.55,700 నా ఖాతాలో జమకాలేదని, పీఏసీఎస్ అధికారుల జేబులోకి వెళ్లిందని తేలింది. పాత రుణానికి సంబంధించిందే రూ.58,254 రుణం ఉన్నట్టు అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. గత సెప్టెంబర్ 29న పీఏసీఎస్ నుంచి పొందిన రూ.1.5 లక్షల రుణం మాఫీ కోసం ప్రభుత్వానికి పంపిన జాబితాలో అధికారులు ప్రస్తావించలేదు. అధికారుల నిర్లక్ష్యం వల్ల రూ.1.5 లక్షల మాఫీ వర్తించకుండా పోయింది. బాధ్యులై చర్యలు తీసుకొని న్యాయం చేయాలి.
– గంగుల పెంటయ్య, రైతు